iDreamPost

ఫ్యాక్షన్ పందెంలో యువకుడి గెలుపు – Nostalgia

ఫ్యాక్షన్ పందెంలో యువకుడి గెలుపు – Nostalgia

సినిమాల్లో ఫ్యాక్షన్ ని వాడుకుని కాసులు చేసుకోవడం సౌత్ లో కొత్తేమి కాదు. మనకు ఈ పాయింట్ వినగానే ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డిలు గుర్తొస్తాయి కానీ 1992లోనే తమ్మారెడ్డి భరద్వాజ ‘కడప రెడ్డెమ్మ’తో ఈ రక్తపాతాన్ని తెరమీద ఆవిష్కరించారు. అందులో స్టార్లు లేకపోవడం, శారద గారు టైటిల్ రోల్ చేయడం వల్ల రీచ్ భారీగా వెళ్ళలేదు కానీ దీంట్లో పగలు ప్రతీకారాలు గట్టిగానే ఉంటాయి. తమిళం విషయానికి వస్తే దేవర్ మగన్(క్షత్రియ పుత్రుడు)తో దీన్ని మొదలుపెట్టి సూపర్ హిట్ అందుకున్నారు కమల్ హాసన్. ఆ తర్వాత బాలకృష్ణను ఈ జానర్ కి ఒక ఊపు ఒక గుర్తింపు తెచ్చిన స్టార్ హీరోగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎందరు ఫాలో అయ్యారో లెక్కబెట్టడం కష్టం.

2000 తర్వాత ఈ ట్రెండ్ కొంత నెమ్మదించింది. ఫ్యాక్షన్ నేపధ్యాన్ని తీసుకుని కొత్త కథలు వండటం రచయితల వల్ల కాలేదు. దానికి తోడు ప్రేక్షకులు కూడా రొటీన్ గా ఫీలవ్వడం మొదలుపెట్టారు. దాంతో బ్రేక్ పడింది. అయితే 2005లో దర్శకుడు లింగుస్వామికి ఈ లైన్ ఎప్పుడైనా వర్కౌట్ అవుతుందనే బలమైన నమ్మకం. తన డెబ్యూ మూవీ ‘ఆనందం’ సక్సెస్ అయ్యాక అజిత్ తో చేసిన ‘జి’ డిజాస్టర్ అయ్యింది. అందుకే మాస్ ని టార్గెట్ చేసి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తీయాలని డిసైడ్ అయ్యారు లింగుస్వామి. అలా రాసుకున్న కథే సందకోజీ. తెలుగులో ‘పందెంకోడి’గా వచ్చిన విశాల్ రెండో సినిమా.

విశాల్ మొదటి చిత్రం ‘చెల్లమే’ మంచి విజయం సాధించింది. తెలుగులో ‘ప్రేమచదరంగం’గా డబ్బింగ్ చేశారు. అలాంటి కుర్రాడితో ఇంత మాస్ సినిమా ఏమిటా అని ఇండస్ట్రీలో అందరూ ఆశ్చర్యపోయారు. స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడుపుతున్న ఓ కాలేజీ కుర్రాడికి స్వంత ఊళ్ళో తండ్రి  రూపంలో పెద్ద ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. ఊరందరూ అతన్ని దేవుడిగా కొలుస్తారు. అలాంటి యువకుడికి కాశి రూపంలో ఓ విలన్ తగులుతాడు. అదే కథ. విశాల్ తనలో ఎనర్జీని ఇందులో పూర్తిగా వాడాడు. చలాకి అమ్మాయిగా మీరా జాస్మిన్ నటన, తండ్రిగా రాజ్ కిరణ్ పెర్ఫార్మన్స్, కొత్త విలన్ లాల్, యువన్ శంకర్ రాజా సంగీతం పందెంకోడిని రెండు భాషల్లోనూ సూపర్ హిట్ చేశాయి. 2006 మే 19న సుమంత్ ‘గోదావరి’తో పాటు రిలీజైన ఈ సినిమా కమర్షియల్ గా భారీ లాభాలను ఇచ్చింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి