iDreamPost

కొఠియా గ్రామాల దురాక్రమణకు ఒడిశా కుట్ర

కొఠియా గ్రామాల దురాక్రమణకు ఒడిశా కుట్ర

ఆ పల్లెల్లో ప్రతి ఇంటికీ రెండు రేషన్ కార్డులు ఉంటాయి. ప్రతి వ్యక్తికి రెండు ఆధార్ కార్డులు ఉంటాయి. రెండు ఓటర్ కార్డులు ఉంటాయి. అలాగని ఇవేవో నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నవి కావు. పూర్తి న్యాయబధ్ధంగా అధికారులు జారీ చేసినవే. కాకపోతే రెండు రాష్ట్రాల తరపున జారీ చేసినవి కావడమే విశేషం. ఎందుకంటే ఆ పల్లెల్లో రెండు ప్రభుత్వాల పాలన సాగుతోంది. ఇటు ఆంధ్ర.. అటు ఒడిశా రాష్ట్రాలు తమవిగా చెప్పుకొంటున్న ఆ గ్రామాలు కొఠియా పల్లెలు.

కొఠియా పంచాయతీ పరిధిలోని మొత్తం 21 గ్రామాలపై దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం నలుగుతోంది. మన రాష్ట్రంలోని విజయనగరం జిల్లా భూభాగంలో ఉన్న ఈ గ్రామాలను కబళించాలని ఒడిశా మళ్లీ మూడేళ్ళుగా రకరకాల పన్నాగాలు పన్నుతోంది. రాష్ట్రాల విభజన సమయంలో అధికారులు నిర్లక్ష్యం వహించిన ఫలితంగా పేరుకు ఆంధ్ర భూభాగంలో ఉన్నా.. ఒడిశా కూడా తమవిగా ఇప్పటికీ వాదిస్తోంది. కబళించేందుకు ప్రయత్నిస్తోంది. 1958 నుంచి నలుగుతున్న ఈ సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించింది. పరిష్కారమయ్యేవరకు యథాతథ పరిస్థితి కొనసాగించాలని ఆదేశించింది.

మూడేళ్ళ నుంచి పెరిగిన దూరాగతాలు

సుప్రీంకోర్టు తీర్పుతో కొఠియా వివాదం పరిష్కారం కాకుండా మరుగున పడిపోయింది. ఆంధ్ర ప్రభుత్వం అందిస్తున్న కార్డులు, సంక్షేమ పథకాలను కొఠియా గిరిజనులు అనుభవిస్తున్న తరుణంలో అంతవరకు నిద్రాణస్థితిలో ఉన్న ఒడిశా ప్రభుత్వం హఠాత్తుగా మేల్కొంది. తను కూడా కోఠియా పల్లెల్లో రేషన్ కార్డుల జారీ, సంక్షేమ పథకాల అమలు ప్రారంభించింది. అక్కడితో ఆగకుండా అభివృద్ధి పేరుతో రోడ్లు కాలువలు వంటి చిన్న చిన్న పనులు చేపడుతూ గిరిజనుల మనసు చురగొనే ప్రయత్నాలు చేపట్టింది. వీటికి సమీపంలో ఉన్న కోరాపుట్ జిల్లా ఎమ్మెల్యేలు, అధికారుల పర్యటనలు పెరిగాయి. ఇటీవల రాత్రికి రాత్రి గంజాయిభద్ర మరికొన్ని గ్రామాలకు రోడ్డు కూడా నిర్మించారు. అయితే ఎంత చేసినా ఆంధ్రప్రదేశ్ వైపే కొఠియా గిరిజనులు మొగ్గుచూపుతున్నారు. ఇక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే కోరుకుంటున్నారు. దీంతో ఇక లాభంలేదని భావించిన ఒడిశా అధికారులు వేధింపులు ప్రారంభించారు.

పంచాయతీ ఎన్నికలపై రగడ

తమ పంతం నెగ్గించుకునే క్రమంలో ఒడిశా అధికారులు ఎన్నికల్లో గ్రామస్తులు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు. ఫిబ్రవరి 13న కొఠియా ప్రాంతంలో ఆంధ్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించినప్పుడు పక్కనే ఉన్న ఒడిశా ప్రాంత నాయకులు, అధికారులు ఏకమై ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కోర్టుకు సైతం వెళ్ళారు. అయినా ఫలితం లేకపోయింది. ఎన్నికలు సజావుగా జరిగాయి.

ఇకముందు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశించాలని కోరుతూ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. అది విచారణలో ఉన్న తరుణంలోనే పరిషత్ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా ఎలాగైనా గిరిజనులను అడ్డుకోవాలని తీర్మానించుకున్న ఒడిశా నేతలు, అధికారులు పోలింగ్ ముందు రోజు రాత్రే రోడ్లకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి, రాళ్లు అడ్డంపెట్టు దారి మూసేశారు. గురువారం ఉదయం పోలింగ్ కేంద్రానికి బయలుదేరిన గిరిజనులను పోలీస్ బలగాల సాయంతో అడ్డుకున్నారు. అయితే గిరిజనులు తిరగబడటం, ఆంధ్ర అధికారులు గట్టిగా ప్రతిఘటించడంతో వారు చివరికి తోక ముడవక తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో గట్టిగా అడ్డుకుంటే తప్ప ఒడిశా దురాక్రమణకు అడ్డుకట్ట పడదని పలువురు స్థానికులు సూచిస్తున్నారు.

Also Read : ఏపీలోనే ఉంటాం.. ఇక్కడే ఓట్లేస్తాం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి