iDreamPost

ఉపాధిహామీ జాబ్‌ కార్డు పొందడం ఇప్పుడు చాలా సులువు

ఉపాధిహామీ జాబ్‌ కార్డు పొందడం ఇప్పుడు చాలా సులువు

కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల పట్టణాలు, నగరాలకు కూలీ పనులు చేసేందుకు వెళ్లిన గ్రామీణ ప్రజలు తిరిగి స్వస్తలాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి గ్రామాల్లో ఉపాధి కల్పించడం ప్రభుత్వాల ముందున్న సవాల్‌. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచింది. రోజుకు సరాసరి 50 లక్షల మందికి పని కల్పిస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇప్పటికే జాబ్‌ కార్డు ఉన్న వారు పని చేసుకునే అవకాశం ఉండగా.. పట్టణాలు, నగరాల నుంచి తిరిగి సొంత ఊళ్లకు వచ్చిన వారిలో అధిక మందికి జాబ్‌కార్డులు లేవు. ఈ నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జాబ్‌కార్డులు తక్షణమే అందించేందుకు గ్రామ సచివాలయాలను ఉపయోగించుకుంటోంది. జాబ్‌కార్డు కావాల్సిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించడం, మండల, జిల్లా అధికారులకు ఆయా దరఖాస్తులను పంపి కార్డులు వెంటనే మంజూరు చేసే పనిని గ్రామ సచివాలయంలోని డిజిటల్‌ అసిస్టెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

ఇప్పటి వరకు ఫీల్ట్‌ అసిస్టెంట్‌ జాబ్‌కార్డులు కావాల్సిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేవారు. ఓ పక్క పని చేయించడం మరో పక్క మస్తర్లను నమోదు చేయించే పనిలో ఫీల్ట్‌ అసిస్టెంట్‌ తీరికలేకుండా ఉండేవారు. ఈ క్రమంలో నూతన జాబ్‌కార్డులు మంజూరు ఆలస్యం జరిగేది. ఉపాధి హామీ సిబ్బంది మస్తర్లను అప్లోడ్‌ చేయడం, కూలీలకు నగదు జమ చేయడంతోపాటు నూతన జాబ్‌కార్డుల కోసం సమాచారం నమోదు చేయడం అదనపు భారంగా ఉండేది. ప్రస్తుతం ఈ పనిని గ్రామ సచివాలయాలకు ఇవ్వడం వల్ల జాబ్‌కార్డులు వేగంగా మంజూరవుతున్నాయి. అదే సమయంలో మస్తర్ల నమోదు, కూలీలకు నగదు జమ వేగంగా చేసేందుకు ఉపాధి హామీ సిబ్బందికి సరైన సమయం దొరుకుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి