iDreamPost

బెడిసికొట్టిన నిమ్మగడ్డ ప్లాన్‌..!

బెడిసికొట్టిన నిమ్మగడ్డ ప్లాన్‌..!

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి… అనే సినిమా గీతం మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలతో.. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం కలిగించారని, అక్రమాలను అడ్డుకోలేదనే కారణాలతో ఉన్నతాధికారులకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పనిష్మేంట్లు ఇస్తుండగా.. అవి వారికి ప్రయోషన్లుగా మారిపోతున్నాయి. గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోలేకపోయారనే కారణం చూపుతూ.. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు శామ్యూల్‌ ఆనంద్, నారాయణ్‌ భరత్‌ గుప్తాలను బదిలీ చేయాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. వాటిని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారిద్దరినీ జీడీఏకు అటాచ్‌ చేశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే వారిద్దరికీ కీలకమైన బాధ్యతలు అప్పగిస్తూ మళ్లీ సీఎస్‌ ఆధిత్యానాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో నిమ్మగడ్డ ఆనందం ఒక్కరోజు కూడా మిగల్లేదు.

నారాయణ్‌ గుప్తాకు సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు ఉంది. డాక్టర్‌ అయిన నారాయణ గుప్తా.. సివిల్‌ సర్వీస్‌ను ఎంచుకుని ప్రజా సేవలోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం వైఎస్‌జగన్‌.. నారాయణ్‌ భరత్‌ గుప్తా ఆసక్తిని, సమర్థతను గమనించి చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. గత మార్చిలో మధ్యలోనే ఆగిపోయిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోలేదంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆయనపై చర్యలకు సిద్ధపడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అదే విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ను కూడా బదిలీ చేయాలని నిమ్మగడ్డ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

సుప్రిం కోర్టు తీర్పును గౌరవించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్‌ఈసీ ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తోంది. వ్యక్తిగత అజెండాతో నిమ్మగడ్డ వ్యహరిస్తున్నారనే విమర్శలు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. అదే సమయంలో సమర్థత, నిజాయతీ గల అధికారులును కాపాడుకుంటోంది. ఈ క్రమంలోనే నిన్నమొన్నటి వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన నారాయణ్‌ భరత్‌ గుప్తాను.. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించింది. ఈ బాధ్యతలతోపాటు.. గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గాను పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. శామ్యూల్‌ ఆనంద్‌కు కూడా కీలకమైన బాధ్యలు అప్పగించింది. ఏపీ షెడ్యూల్‌ కులాల సహకార ఆర్థిక సంస్థ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైర్టెర్‌గా నియమించింది. కొత్తగా సృష్టించిన గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సెక్రటరీగాను బాధ్యలు అప్పగించింది. జిల్లా కలెక్టర్లుగా పని చేస్తున్న అధికారులకు.. నిమ్మగడ్డ చర్యల వల్ల.. రాష్ట్ర స్థాయిలో కీలకమైన బాధ్యతలు దక్కడం గమనార్హం.

తాజా పరిణామాలతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహార శైలిలో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను బదిలీ పనిష్మెంట్‌ ఇస్తున్న వారికి ప్రమోషన్లు దక్కుతుండడం నిమ్మగడ్డకు మింగుడు పడడంలేదు. రేపోమాపో తిరుపతి అర్భన్‌ ఎస్పీగా నిన్నమొన్నటి వరకు పని చేసిన ఆవుల రమేష్‌రెడ్డికి పోస్టింగ్‌ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపై ఎవరిని బదిలీ చేసినా.. వారికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉండడంతో నిమ్మగడ్డ ఆ దిశగా ఆలోచించే ప్రయత్నాలు చేయకపోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏకపక్షంగా బదిలీ చేసి విమర్శలపాలవడం, ఆ పై బదిలీ చేసిన వారికి పదోన్నతులు దక్కడం వంటి పరిణామాలతో వ్రతం చెడ్డా ఫలితం దక్కని పరిస్థితి నిమ్మగడ్డకు ఎదురవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి