దిశ హత్యాచార ఉదంతం చూసి చలించిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇకపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లలో జీరో ఎఫ్ఐఆర్ అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గతంలో వివిధ కేసుల్లో ఫిర్యాదులు చేయడానికి వెళ్ళినప్పుడు, ఈ కేస్ తమ పరిధిలోకి రాదని పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసేవారు. ఇకపై అలా చేయడానికి వీల్లేదు.
నిజానికి ఈ జీరో ఎఫ్ఐ ఆర్ అనేది 2012లో నిర్భయ ఉదంతం తర్వాత జస్టిస్ వర్మ కమిటీ రిపోర్ట్, రికమండేషన్ మీద జీరో ఎఫ్ఐఆర్ అమల్లోకి వచ్చింది.గత ఆరేళ్ళ నుండి అమల్లో ఉంది. కానీ పోలీసు అధికారుల్లో చాలామందికి జీరో ఎఫ్ఐఆర్ అంటే తెలియకపోవడమో మరేదో కారణం వల్లనో వివిధ కేసుల నమోదులో తమ పరిధిలోకి రాదని తప్పించుకునే ప్రయత్నాలు చేయడం రివాజుగా మారింది.
జీరో ఎఫ్ఐఆర్ అంటే ముందు బాధితులు ఎవరైనా తమ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ గా కేస్ నమోదు చేసి ఫిర్యాదు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో గుర్తించి ఆ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేస్తారు. అంటే ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చన్నమాట.దిశ హత్యాచార కేసులో ఫిర్యాదు నమోదు చేసుకోవడానికి తమ పరిధి కాదని పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇకపై అలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకుండా ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం అభినందనీయం