iDreamPost
iDreamPost
వైఎస్సార్సీపీ అధినేత మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో విశ్వసనీయతకు ప్రాధాన్యతనిచ్చారు. కొత్త అభ్యర్థిని తెరమీదకు తెచ్చారు. గడిచిన కొన్నేళ్ళుగా తన వెంట నడిచిన నేతను అభ్యర్థిగా బరిలో దింపుతున్నారు. దాంతో ఇప్పటికే బాపట్ల ఎంపీ స్థానం నుంచి నందిగమ సురేష్ కి అవకాశం ఇచ్చినట్టే ఈసారి తిరుపతి నుంచి గురుమూర్తికి ఛాన్స్ దక్కుతోంది. ఆయన పేరుని ఇప్పటికే వైఎస్సార్సీపీ అధిష్టానం ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి గడిచిన సాధారణ ఎన్నికల్లో బల్లి దుర్గా ప్రసాద్ ఘన విజయం సాధించారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమీప ప్రత్యర్థి పనబాక లక్ష్మిని సుమారుగా 2.4లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే ఏడాదిన్నర గడిచిన తర్వాత ఆయన అనూహ్యంగా కరోనా సోకడం, అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దాంతో ఈసారి ఆయన కుటుంబం నుంచి ఒకరికి పోటీ చేసే అవకాశం ఇస్తారని అంతా భావించారు. దానికి అనుగుణంగా బల్లి దుర్గా ప్రసాద్ తనయుడు చైతన్యకే ఛాన్స్ అంతా భావించారు. కానీ అనూహ్యంగా మృతి చెందిన ఎంపీ కుటుంబం నుంచి బరిలో దిగే వారి పట్ల సానుభూతితో పోటీకి దూరంగా ఉండాల్సిన ప్రతిపక్ష టీడీపీ ఆనవాయితీని పక్కన పెట్టేసింది. అధికార పార్టీ అభ్యర్థిని ఖరారు చేయకముందే తన పార్టీ తరుపున పనబాక లక్ష్మి మరోసారి పోటీలో ఉంటారని ప్రకటన చేసింది.
దాంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన జగన్ తాజాగా తన అభ్యర్థిగా గురుమూర్తిని తెరమీదకు తెచ్చారు. ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు , జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఇతర మంత్రులతో చర్చించారు. నేతలంతా కలిసి అభ్యర్థి ఎంపికను ముఖ్యమంత్రికి అప్పగించారు. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. దాంతో గతంలో పాదయాత్రలో తన వెంట సుదీర్ఘకాలం పాటు సాగిన గురుమూర్తిని జగన్ ఖరారు చేశారు. గతంలో అమరావతి ఉద్యమంలో జగన్ మాటను జవదాటకుండా పోరాడిన నందిగమ సురేష్ కి బాపట్ల ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించినట్టే ఇప్పుడు పార్టీకి విధేయంగా ఉన్న గురుమూర్తిని పార్లమెంట్ కి పంపించేందుకు జగన్ సంకల్పించారు.
అదే సమయంలో బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఖాయం చేశారు. వచ్చే మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి అవకాశం ఇచ్చేందుకు ఒప్పించారు. దాంతో వరుసగా మూడు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున మూడో అభ్యర్థి తిరుపతి పార్లమెంట్ బరిలో దిగడం ఖాయంగా మారింది. తొలుత 2014 ఎన్నికల్లో వర ప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బల్లి దుర్గా ప్రసాద్ గెలిచారు. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గురుమూర్తి బరిలో నిలుస్తున్నారు. కొత్త అభ్యర్థి కావడంతో టీడీపీకి ఆయన్ని ఎదుర్కోవడం మరింత సమస్యగా మారడం అనివార్యమని పరిశీలకుల అంచనా.