మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలచుఁదఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ .
సమర్ధుడైన మంత్రి లేని రాజ్యము , కీలక భాగం లేని యంత్రము విఫలమవుతాయని భావము .
ఏ రాజుకైనా రాజ్యస్థాపనకు , స్థిరత్వానికి చాణిక్యుడు లాంటి సలహాదారుడు అవసరం. రాజు రాజ్య పాలన , ప్రజా సంక్షేమం పై దృష్టి పెడితే చాణిక్యుడు లాంటి సలహాదారుడు వెనకుండి కార్యాలు చక్కబెడతాడు . రాజ్యంలో రాజుపై జరిగే కుట్రలను చేదిస్తూ రాజుకు అన్ని విదాలుగా అండగా ఉంటారు. సరిగ్గా ఇలాంటి జోడియే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ విజయసాయిరెడ్డి గా చెప్పవచ్చు . జగన్ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమం అందిస్తూ వేగంగా పాలనలో దూసుకు వెల్తుంటే మరో పక్క విజయసాయిరెడ్డి గారు రాజకీయ ప్రత్యర్ధుల కుట్రలను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ప్రభుత్వాన్ని స్థిరంగా నడపడంలో తన వంతు పాత్ర విజయవంతంగా పోషిస్తున్నారు.
1957 లో నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలోని తాళ్లపుడి గ్రామంలో వేణుంబాక సుందరరామిరెడ్డి, సుజాతమ్మ దంపతులకు జన్మించారు విజయసాయిరెడ్డి . ఏపీ మాజీ డిజిపి దినేష్ రెడ్డి విజయ సాయి రెడ్డి గారి పెదనాన్న కుమారుడు . విజయసాయి రెడ్డి డిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా లో ఎఫ్.సీ.ఎ పూర్తిచేశారు. ఆ తరువాత వి.ఎస్.రెడ్డి అసోసియేట్స్ పేరు మీద చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో సొంతంగా ఆఫీసులు మొదలుపెట్టి అనేక పేరొందిన కంపెనీలకి ఆడిటర్ గా సేవలు అందించారు.
విజయసాయి రెడ్డి చెన్నైలో ఆఫీస్ నడిపే రోజుల్లో వైఎస్ఆర్ కుటుంబంతో ఏర్పడ్డ పరిచయంతో వారి మైనింగ్ వ్యాపారాలకు ఆడిటర్ గా వ్యవహరించారు. వైఎస్ఆర్ కుటుంబం వలన కడప ప్రాంతంలో విజయ సాయి రెడ్డికి విస్తృతమైన పరిచయాలు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్ పెద్దరికంతో లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట రామసుబ్బారెడ్డి కూతురిని విజయసాయిరెడ్డి వివాహం చేసుకున్నారు.
గడికోట రామసుబ్బారెడ్డి కొడుకు ,విజయసాయిరెడ్డి బావమరిది అయిన ద్వారకానాథ్ రెడ్డి 1994లో టీడీపీ తరుపున లక్కిరెడ్డిపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు రెండుసార్లు కాంగ్రెస్ తరుపున, టీడీపీ తరుపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడెప్పగారి రాజగోపాల్ రెడ్డి 1989లో కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా గెలవడంతో గడికోట కుటుంబానికి పోటీచేసే అవకాశం రాలేదు. 1994లో కూడా వైఎస్ఆర్ వ్యతిరేకించినా కూడా కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికే టికెట్ ఇవ్వటంతో యువకుడైన ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ తరుపున పోటీచేసి రాజకీయ దురందురుడిగా పేరుపొందిన రాజగోపాల్ రెడ్డిని ఓడించి ఆయన డబుల్ హ్యాట్రిక్ విజయానికి బ్రేక్ వేశారు. ఈ రెడెప్పగారి రాజగోపాల్ రెడ్డి పులివెందుల సతీష్ రెడ్డి మేనత్త భర్త .రాజగోపాల్ రెడ్డి కొడుకులు రమేష్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి కడప జిల్లా టీడీపీ కి ప్రస్తుత కేర్ అఫ్ అడ్రస్.. గడికోట శ్రీకాంత్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి,ద్వారకానాథ్ రెడ్డి తండ్రి రామసుబ్బారెడ్డి కజిన్స్ .
ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడైన విజయసాయి రెడ్డి 2006లో టిటిడి ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌కు నామినేట్ అయ్యారు. దాంతో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సహా పలు బ్యాంకుల డైరెక్టర్‌గా కూడా సేవలు అందించారు. ఆర్ధిక అంశాల అధ్యయనానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తరుపున విదేశాలకు వెళ్లిన పలు బృందాలలో విజయసాయిరెడ్డి సభ్యులు. వేల మందికి ఉపాధి కలిగించిన అత్యున్నత వ్యాపార సంస్థలకు ఆడిటర్ గా , ఆర్ధిక అంశాల సలహా దారుగా వ్యవహరించిన ఆయన ఆయా వ్యాపార సంస్థల ఆర్ధిక వ్యవహారాల్లో ఎక్కడా చిన్న తప్పు జరగకుండా నిబందనలకు లోబడి వ్యాపార లావాదేవీలు జరిపించి ఆయా సంస్థలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని చెబుతారు.
వై.యస్.ఆర్ చనిపోయిన తరువాత డిల్లీ నుండి గల్లీ వరకు ఉన్న లీడర్లు జగన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నంలో ఎన్ని వేదింపులకు గురిచేసినా భయపడకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడిన వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి గారు ముఖ్యులు. జగన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తరువాత పార్టీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుని ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించి పార్టీని వెనకుండి నడిపిన వ్యక్తిగా విజయసాయి రెడ్డిని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు చూస్తారు.
2016 జూన్ లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి గారు దేశ రాజకీయాల్లో వైసీపీకి చెందిన కీలక నేతగా మారారు. పార్లమెంటు సమావేశాలలో పలు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టి పార్టీ వాదాన్ని కేంద్రానికి బలంగా చాటి చెప్పిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే పార్టీ తరుపున ఒక పక్క డిల్లీ వ్యవహారాలు చూసుకుంటూనే జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో పార్టీ వ్యవహరాలని మొత్తం తన బుజస్కందాలపై మోయడంతో పాటు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తో కలిసి ఎన్నికల అభ్యర్ధులని ఎంపిక చేయడంలో చాణిక్య నీతిని ప్రదర్శించి అపర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
వై.యస్ కుటుంబంతో 42 ఏళ్ల అనుభంధం కలిగిన విజయసాయిరెడ్డి , జగన్ కు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టికి తోడుగా ఉంటూ అనుక్షణం ఆ కుటుంబ అభివృద్దికి తన వంత తోడ్పాటు అందిస్తూ నమ్మకానికి ప్రతిరూపంగా మారారు. నేడు 63వ జన్మదినం జరుపుకుంటున్న విజయసాయిరెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు ..