iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులానికి ఉన్న ప్రాధాన్యత ఇక దేనికీ ఉండదు. అందుకే కుల సమీకరణాల వైపు ప్రతీ పార్టీ కన్నేసి ఉంచుతుంది. దానికి తగ్గట్టుగా కుల ప్రస్తావన లేకుండా పొద్దుగడవదు చాలామందికి. అందులోనూ సంఖ్యాపరంగా కాపులు కీలక స్థానంలో ఉండడంతో వారికి తగిన గుర్తింపు దక్కుతూ ఉంటుంది. పదవుల కేటాయింపులోనూ, ఇతర అంశాల్లోనూ కాపులకు పెద్ద పీట వేస్తుంటారు. అన్ని పార్టీలూ కాపులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో ఉంటాయనడంలో సందేహం లేదు.
కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాలన్నీ దాదాపుగా ఒకే తరగతిగా భావిస్తే సుమారు 13శాతం మంది ఉన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సర్వే ఫలితాలు చెప్పాయి. దానిని బట్టి సామాజికంగా ఎస్సీల తర్వాత పెద్ద సంఖ్యగానే చెప్పాలి. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే మొదటి స్థానంలో ఉండే బీసీలు వివిధ సామాజికవర్గాలుగా ఉంటారు. ఇక ఓసీలలో రెడ్డి, కమ్మ కులాలు తక్కువ సంఖ్యలోనే ఉంటూ రాజకీయంగా చక్రం తిప్పడం కాపులను ఆలోచనకు గురిచేసింది. దాంతో పలు ప్రయత్నాల తర్వాత చివరకు 2009 ఎన్నికల్లో అడుగుబయటపెట్టినప్పటికీ ఆయన కాపుల పరిధిని మించి ఇతరులను చేరుకోలేక చతికిలపడ్డారు. కేవలం కాపులు ఎక్కువ సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో మాత్రమే కొంత ఆశాజనకంగా ఫలితాలు సాధించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాకతో మళ్లీ కాపు ఓట్ బ్యాంక్ సమీకృతం అవుతుందని ఆశించినప్పటికీ జనసేనాది విఫలప్రయత్నంగా మిగిలిపోయింది. పవన్ ని సొంత సామాజికవర్గం కూడా దగ్గరకి చేర్చుకోలేదు. చివరకు 6శాతం ఓట్లతో చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది.
రాజకీయ లక్ష్యంతో కాపు సామాజికవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఇద్దరు సినీ తారలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో మళ్లీ కాపులు సొంతంగా పావులు కదిపే అవకాశాలు కుచించుకుపోయాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో కాపులు ఎటు మొగ్గుచూపుతారోననే చర్చ మొదలయ్యింది. వాస్తవానికి కాపులు తొలి నుంచి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. వంగవీటి రంగా ఉదంతం తర్వాత టీడీపీ కోస్తాలో తుడిచిపెట్టుకుపోవడానికి వారి ఆగ్రహం కూడా ఓ కారణం. ఆతర్వాత మెజార్టీ కాపులు టీడీపీకి దూరంగా ఉన్న విషయాన్ని చంద్రబాబు కూడా గ్రహించారు. దాంతో తన పాదయాత్రలో కాపులకు బీసీ హోదా కల్పిస్తాననే ఓ డిమాండ్ ని తెరమీదకు తీసుకొచ్చి, వారిని ఆకట్టుకున్నారు. అది సాధ్యం కాదని చెప్పిన జగన్ ని పక్కన పెట్టి కాపులు 2014 ఎన్నికల్లో చంద్రబాబుని గద్దెనెక్కించారు. కానీ తీరా బాబు తన మార్క్ మోసానికి ఒడిగట్టినట్టు తెలుసుకున్న కాపులు ఉద్యమానికి దిగారు. ముద్రగడ పద్మనాభం వంటి వారు అనేక అవమానాలు ఎదుర్కొంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం కాపు కార్పోరేషన్ కి నిధులు కేటాయించడంలోనూ, ఇతర హామీల విషయంలోనూ నిర్లక్ష్యం చూపడంతో రగిలిపోయిన కాపులు మొన్నటి ఎన్నికల్లో గట్టిగానే బుద్ధి చెప్పారు.
ప్రస్తుతం ఏపీలో టీడీపీ తరుపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో కేవలం ఇద్దరంటే ఇద్దరు మాత్రమే కాపు నేతలు ఉన్నారంటే వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అదే సమయంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా 2014 ఎన్నికల్లోనే జగన్ ని ఆదరించిన కాపులు జనసేనానిని కూడా పక్కన పెట్టేశారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పథకాలతో కాపులు పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కాపు మహిళల్లో ముఖ్యమంత్రికి ఆదరణ పెరిగింది. గతంతో పోలిస్తే ఇతర పార్టీల అభిమానులు కూడా జగన్ సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతున్నారు. దానికి తోడుగా వరుసగా కాపు నేతలు వైఎస్సార్సీపీ వైపు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే ఎన్నికల ఫలితాల తర్వాత తోట త్రిమూర్తులు వంటి నేతలే జగన్ గూటికి చేరారు. తాజాగా పంచకర్ల రమేష్ బాబు, చలమలశెట్టి సునీల్ కూడా కండువాలు కప్పుకున్నారు. త్వరలో మరికొందరు నేతలు కూడా జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఓవైపు కాపు కార్పోరేషన్ కి కేటాయింపులు పెంచడం, సకాలంలో నిధులు అందించడం, మరోవైపు కొత్తగా కాపు నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలను మెప్పించడంతో వైఎస్సార్సీపీకి కాపులలో ఆదరణ పెరిగిందనే అంచనాలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కూడా జగన్ స్పష్టమైన వైఖరి తీసుకోవడంతో చాలామందిని అది ఆలోచింపజేసింది. ఈ తరుణంలో కాపుల ఓట్ బ్యాంకు ఇప్పటికే టీడీపీకి దాదాపు దూరం కాగా, బీజేపీ సహా ఇతర పార్టీలు పెట్టుకుంటున్న ఆశలు కూడా నెరవేరే అవకాశం లేదని తాజా పరిణామాలు చాటుతున్నాయి. కాపులను ఆదరించడం, వారికి తగిన గుర్తింపు, అవసరమైన నిధులు కేటాయించడం ద్వారా జగన్ సర్కారు మరింత దూసుకువెళ్లే అవకాశాలున్నట్టు కాపు ఆలోచనాపరుల అభిప్రాయంగా చెప్పవచ్చు.