iDreamPost
iDreamPost
వైస్సార్‌సీపీకి ఓట్లేస్తే స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేసేందుకు ఆ పార్టీకి పర్మిషన్ ఇచ్చినట్లేనని విశాఖలో ప్రచారం చేశారు.. విశాఖ అంటే తనకెంతో ఇష్టమని.. ఈ నగరాన్ని ఆర్థిక రాజధాని చేసింది తానేనని ఊదరగొట్టారు.. తీరా విజయవాడకు వెళ్లి.. వైస్సార్‌సీపీకి ఓటు వేస్తే మూడు రాజధానులకు మద్దతు ఇచ్చినట్లేనని అక్కడివారిని రెచ్చగొట్టారు. ఈ మాటల మాయజాలాలేవీ పని చేయలేదు. తండ్రీకొడుకుల మాటలను ప్రజలు విశ్వసించలేదు. స్టీల్‌ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం చేస్తన్న ప్రయత్నాలకు, విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న సీఎం వైఎస్ జగన్ సంకల్పానికే జై కొట్టారు.
రాష్ట్రంలోని అతిపెద్ద నగరపాలక సంస్థ అయిన గ్రేటర్ విశాఖను ఓట్ల పువ్వుల్లో పెట్టి వైఎస్సార్‌సీపీకి అప్పగించారు. మెజారిటీ డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించి.. మేయర్ పీఠం అధిష్టించి అర్హత కల్పించారు. జీవీఎంసీ పరిధిలో 98 వార్డులు ఉండగా.. 58 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థలే విజయఢంకా మోగించారు. 30 డివిజన్లలో టీడీపీ గెలవగా.. జనసేన 3, సీపీఐ, సీపీఎం, బీజేపీ చెరో సీటు దక్కించుకున్నారు. ఇండిపెండెంట్లు నాలుగు చోట్ల విజయం సాధించగా.. వారిలో ఇద్దరు అధికార పార్టీ రెబల్స్ కావడంతో వారు సొంత పార్టీలోకి మారే అవకాశం ఉంది.
తండ్రీకొడుకులు కాళ్లకు చక్రాలు కట్టుకున్నా..
పంచాయతీ ఎన్నికల్లో గట్టి దెబ్బతిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మున్సిపల్ ఎన్నికల్లో.. ముఖ్యంగా విశాఖలో సత్తా చాటాలని తాపత్రయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో జీవీఎంసీ పరిధిలోని నాలుగు అసెంబ్లీ సీట్లలో టీడీపీ విజయం సాధించడంతో.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇక్కడి ఓటర్లు టీడీపీనే ఆదరిస్తారని భావించారు. ఎలాగైనా జీవీఎంసీపై పట్టు సాధించి మూడు రాజధానుల ప్రతిపాదనకు విశాఖ ప్రజలే మద్దతు పలకడం లేదని చెప్పించాలనుకున్నారు. అందుకే చంద్రబాబు, లోకేష్‌లు రెండేసి రోజులు విశాఖలోనే మకాం వేసి దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ రోడ్‌షోల పేరుతో కలియదిరిగి ప్రచారం చేశారు.
మూడు రాజధానుల గురించి ప్రస్తావిస్తే ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో ప్రచారంలో ఎక్కడా ఆ ఊసే ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. అదే సమయంలో తెరపైకి వచ్చిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని అందిపుచ్చుకొని వైఎస్సార్‌సీపీ పైనా.. రాష్ట్ర ప్రభుత్వంపైనా అభాండాలు వేశారు. ఉక్కు ఫ్యాక్టరీ వాటాల విక్రయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదని తెలిసినా.. జగన్ ప్రభుత్వమే దాన్ని అమ్మేస్తుందన్నట్లు ఆరోపణలు చేస్తూ.. వైఎస్సార్‌సీపీ ఓటేస్తే స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి అనుమతి ఇచ్చినట్లేనని విష ప్రచారం చేశారు. అయితే ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారు. తండ్రీకొడుకుల విష ప్రచారాన్ని తిప్పికొట్టారు. 94 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీని 30 సీట్లకే పరిమితం చేశారు.
బీజేపీ-జనసేనలకు పరాభవం
విశాఖ నగరంలో తమకు ఎంతో పట్టుందని ఎగిరెగిరి పడిన బీజేపీ-జనసేన కూటమికి విశాఖ ప్రజల చేతుల్లో పరాభవం తప్పలేదు. నగర ఓటర్లలో.. విద్యవంతుల్లో తమ పార్టీకి ఆదరణ ఉందని బీజేపీ ఎప్పటినుంచో చెప్పుకుంటోంది. మరోవైపు తమ సామాజికవర్గం, యూత్ ఓట్లు తమకే లభిస్తాయని జనసేన ఆశలు పెట్టుకుంది. తమ బలాన్ని అతిగా ఊహించుకుని రెండూ కలిసి 95 డివిజన్లలో పోటీ చేశాయి. కానీ చివరికి వారికి దక్కినవి నాలుగు స్థానాలే. 51 స్థానాల్లో పోటీచేసిన జనసేన మూడు చోట్ల మాత్రమే గెలవగా.. బీజేపీ పరిస్థతి మరీ దారుణం. 44 చోట్ల పోటీ చేసిన ఆ పార్టీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్టీల్‌ప్లాంగ్ ప్రైవేటీకరణ అంశం బీజేపీ ఆశలకు గండికొట్టింది. ఉక్కు ఉద్యమానికి తొలుత మద్దతు తెలిపినా.. తర్వాత పే్లటు ఫిరాయించి ప్రైవేటీకరణే జరగదని బుకాయించడం.. పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయడం ఖాయమని మరోసారి కుండబద్దలు కొట్టడం వంటి పరిణామాలతో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. ఆ పార్టీతో జతకట్టిన పాపానికి ఆ ప్రభావం జనసేనపైనా పడింది. ఫలితంగా రెండు పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి.
ప్రణాళికతో ప్రతిబంధకాలను ఛేదించుకొని..
మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విజయంపై ఆశలు రేపుతున్నా.. సార్వత్రిక ఎన్నికల్లో జీవీఎంసీ పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను టీడీపీకి కోల్పోవడం, స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయం నేపథ్యంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమం.. కేంద్ర నిర్ణయాన్ని తమకు అంటగడుతూ టీడీపీ, జనసేనలు చేస్తున్న తప్పుడు ప్రచారం.. స్టీల్ ఉద్యమానికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడి నిరసన దీక్ష.. నగరంలో పార్టీ కాస్త బలహీనంగా ఉండటం తదితర అంశాలు వైఎస్సార్‌సీపీ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆ పార్టీ అగ్రనేతలు అప్రమత్తమయ్యారు. విశాఖను నోడల్ జిల్లాగా చేసుకొని గత ఎన్నికలకు ముందు నుంచే ఇక్కడి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జీవీఎంసీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్నీ తానే అయి వ్యవహరించారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైకాపా, రాష్ర్ట ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న విషయం.. దానికి ప్రత్యామ్నాయాలు సూచిస్తూ ముఖ్యమంత్రి జగన్ రెండుసార్లు ప్రధాని మోదీకి లేఖలు రాయడం, అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధపడటం, అవసరమైతే స్టీల్‌ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని నిర్వహించడానికి సై అనడం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందకు ఆయన స్వయంగా ఉక్కు పరిరక్షణ సంకల్ప యాత్ర నిర్వహించడం ద్వారా సక్సెస్ అయ్యారు. ప్రచారంలోనూ తీవ్రంగా శ్రమించారు. అన్ని డివిజన్లలోనూ పర్యటించి విస్తృత ప్రచారం చేశారు. దాంతో ప్రతిపక్షాల కుట్రలు, విషప్రచారాలన్నీ పటాపంచలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే మెజారిటీ డివిజన్లను కైవసం చేసుకున్నారు. ఉక్కు ఉద్యమ ప్రభావం ఉన్న గాజువాక నియోజకవర్గంలోనూ అధికార పార్టీకే ఎక్కువ డివిజన్లు లభించాయి. మొత్తంగా ప్రజాతీర్పు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వచ్చింది. విశాఖలో ఆ పార్టీ జెండా ఎగిరింది. విశాఖ రాజధాని అయ్యేందుకు మార్గం సుగమం చేసింది.