iDreamPost
iDreamPost
గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు వైఎస్సార్సీపీ రంగంలో దిగింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి జగన్ తో భేటీ అయిన తర్వాత నియోజకవర్గంలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బరిలో దిగిన యార్లగడ్డ వెంకట్రావుని డీసీసీబీ చైర్మన్ పదవి వరించింది. ఆయన్ని జిల్లా స్థాయిలో గుర్తింపు దగిన పాత్ర ఇచ్చి వంశీకి లైన్ క్లియర్ చేసినట్టుగా కనిపించింది. అయితే మరో సీనియర్ దుట్టా రామచంద్రరావు మాత్రం పదే పదే వంశీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో వివాదంగా పరిణమిస్తున్నట్టు ప్రచారం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో నేరుగా వంశీ వెళ్లి దుట్టా రామచంద్రరావుతో భేటీ అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. వ్యవహారం ముదురుతున్నట్టు భావించారు.
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు తాను సిద్ధమేనన్నట్టుగా వంశీ సంకేతాలు ఇస్తున్నారు. గన్నవరంలో అలాంటి పరిస్థితి వస్తుందనే అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్టానం రంగంలో దిగింది. తాజాగా పార్టీ అధినేత ఆదేశాలతో జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి ముందుకొచ్చారు. వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రావుతో సమావేశమయ్యారు. ఇరువురిని సమన్వయం చేసే బాధ్యత తీసుకున్నారు. పరిస్థితిని చక్కదిద్ది, గన్నవరం పరిణామాలను మరింత సానుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాన్ని ఇద్దరూ కలిసి నిర్వహించాలని ఆదేశించారు. అంతేగాకుండా ఒకే వేదికపై ఇద్దరూ కలిసి కార్యకర్తలకు కనిపించాలని కూడా సూచించారు. ఇకపై పార్టీ వ్యవహారాలను వల్లభనేని వంశీ చూస్తారని, దుట్టా సహకరించాలని జగన్ ఆదేశాలుగా వారికి తెలిపినట్టు సమాచారం. అంతేగాకుండా దుట్టా కుటుంబానికి తగిన స్థానం కల్పించేందుకు ఇప్పటికే జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చి జగన్ శిబిరంలో చేరిన వారికి ఎటువంటి సమస్య రాకుండా చూసేందుకు తొలుత గన్నవరం మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. పాత, కొత్త నేతల మధ్య కలహాలు తలెత్తకుండా జాగ్రత్తల్లో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తాజా పరిణామాలతో గన్నవరంలో రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. ఉప ఎన్నికలకు దారితీస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.