iDreamPost
iDreamPost
రాష్ట్రంలో సాంస్కృతిక రాజధాని అనగానే గుర్తొచ్చే పేరు రాజమహేంద్రవరం. అటు మెట్రోపాలిటన్ సిటీకి, ఇటు గ్రామీణ వాతావరణానికి మధ్యన రాజమహేంద్రవరం వాతావరణం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒక కారణంతో రాజమహేంద్రవరం వచ్చిన వాళ్ళు అక్కడ్నుంచి మరో వెళ్ళేందుకు ఇష్టపడరు. ఎందుకంటే ఆహ్లాదకరమైన గోదావరి నది పక్కనే ఉంటుంది, ఆత్మీయంగా పలకరించే జనాలు, విద్య, వైద్యం.. ఇలా అనేక కారణాలు చెబుతుంటారు. రాజకీయంగా కూడా రాజమహేంద్రవరం ప్రాంతం అత్యంత చైతన్యవంతమైన నియోజకవర్గాల్లో ఒకటిగా చెబుతారు.
అయితే ఈ నగరంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీదే ఆధిపత్యంగా చెప్పొచ్చు. కారణం ఏదైనా మూడు సార్లు కార్పొరేషన్ పదవి టీడీయే గెల్చుకుంది. యంఎస్ చక్రవర్తి, ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, పంతం రజనీశేషసాయిలు మేయర్‌లుగా పనిచేసారు. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా టీడీపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతర కార్పొరేషన్లకు భిన్నంగా ఇక్కడి ఓటర్లు ఇప్పటి వరకు తీర్పునివ్వడం గమనించొచ్చు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంది. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ రెండోసారి బరిలోకి దిగనుంది. ఇంకా ఎన్నికలు సందడి కనుచూపు మేరలో కానరాకపోయినప్పటికీ వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం మేయర్ పీఠంపై ముందుగానే కన్నేసిన సంకేతాలు కన్పిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌గా శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం ఉన్నారు. అలాగే ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజులకు నగరంలో మంచి పట్టే ఉందని చెప్పాలి. ప్రతిష్టాత్మకంగా భావించే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపర్చిన ప్యానల్‌ను గెలిపించడంలో వీరంతా చురుగ్గానే వ్యవహరించారు. తద్వారా ప్రత్యర్ధులకు తమ అసలు లక్ష్యం గురించి చెప్పకనే చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రత్యర్ధులకంటే ఒకడుగు ముందుగానే రాజమహేంద్రవరం కార్పొరేషన్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు మందడుగు వేస్తున్నారనే చెప్పాలి. గుడ్‌మార్నింగ్ పేరిట ఆ పార్టీ నాయకులు, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో సహా నగర వాసులను పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తద్వారా మేయర్ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వార్డుల వారీగా షెడ్యూల్‌ను ప్రకటించి, ఆయా వార్డుల్లో పర్యటిస్తూ జనంతో మమేకమయ్యేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుని ప్రత్యర్ధులకు ధీటుగానే సవాల్ విసురుతున్నారు. ఏకతాటిపైకి వచ్చిన నాయకత్వం, జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజల సమస్యలను వెనువెంటనే పరిష్కరించే కార్యాచరణతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలనే ప్రారంభించినట్లు వైసీపీ శ్రేణులు సంకేతాలిస్తున్నాయి. ఇప్పటి వరకు దక్కని మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
మరోవైపు రాజమహేంద్రవరం పట్టణంలో టీడీపీ పట్టును కూడా కాదనలేనిదనే చెప్పాలి. వైఎస్సార్‌సీపీ ప్రభంజనంలో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ భారీ మెజార్టీతో గెలుపొందారు. భవానీ మామ అప్పారావు ఎమ్మెల్సీగా సేవలందించారు. అప్పారావు సతీమణి వీరరాఘవమ్మ గతంలో మేయర్‌గా పనిచేసారు. వీరికి తోడు టీడీపీ కీలక నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి సొంత పట్టుకూడా ఈ నగరంలోని పలు వార్డుల్లో ప్రభావిత స్థాయిలోనే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో యాభై డివిజన్లకుగాను కేవలం 8 డివిజన్లలో మాత్రమే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్ధులు విజయం సాధించగలిగారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ గుడ్‌మార్నింగ్ పేరిట చేపట్టిన ముందస్తు కార్యాచరణకు టీడీపీ నుంచి ఏ విధమైన ప్రతిచర్య ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా రాష్ట్రంలోని కీలక కార్పొరేషన్లలో రాజమహేంద్రవరం ఒకటి. ఇక్కడి మేయర్ పీఠంపై వైఎస్సార్‌సీపీ చాలా ఆశలే పెట్టుకుంది. అదే సమయంలో దీనిని టీడీపీ కూడా అంత తేలిగ్గా వదులుకునే పరిస్థితి ఉండబోదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా ఓటర్లు ఎవరిని కనికరిస్తారో కాలమే తేల్చాల్సి ఉంది.