iDreamPost
android-app
ios-app

దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు..

దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు..

దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. మహానేత వైస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించిన రెండు నెలల్లోపే ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం.

వివరాల్లోకి వెళితే శ్రీ‌కాకుళం జిల్లా భామిని మండ‌లం కొర‌మలో కొందరు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వసం చేశారు. దుండగులు విగ్రహాన్ని ప్రతిష్టించిన స్థలం నుండి పూర్తిగా పెకళించి కింద పడేసారు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు అక్కడకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

గత నెల సెప్టెంబరు 2 వ తేదీన డీసీసీబీ చైర్మన్ పాల‌వ‌ల‌స విక్రాంత్ ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వి.క‌ళావ‌తి త్వరలోనే నిందితులను పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. జరిగిన దుర్ఘటనను ఖండించారు. డీసీసీబీ చైర్మన్ పాల‌వ‌ల‌స విక్రాంత్‌ కూడా ఈ ఘటనను ఖండించారు. కాగా వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేయడంతో నిందితులను త్వరలోనే పట్టుకుని చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.