ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందించడమే “వైస్సార్ నవశకం” ముఖ్య ఉద్దేశ్యం. గ్రామ సచివాలయాల ద్వారా నేరుగా ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తిస్తున్నారు. అర్హులను గుర్తించేందుకు వీలుగా నవంబర్ 20 నుండి, డిసెంబర్ 20 వరకు గ్రామ వాలంటీర్ల సహాయంతో ఇంటింటి సర్వే చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ వాలంటీర్ ఆధ్వర్యంలో 50 ఇళ్ళు ఉన్నా, సర్వే పారదర్శకంగా తప్పులు లేకుండా జరగాలని రోజుకి ఐదు ఇళ్ళు చొప్పున సర్వే చేయమని గ్రామ వాలంటీర్లకు చెప్పినట్లు సమాచారం. మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులు, మున్సిపాలిటీ స్థాయిలో కమిషనర్లు ఈ సర్వేలను పర్యవేక్షిస్తారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనగా, రేషన్ కార్డులు, ఫించన్ కానుక, ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా, నేతన్న హస్తం,సున్నాశాతం వడ్డీ, అమ్మఒడి లాంటి పథకాలకు అర్హులను గుర్తించేందుకు ఈ సర్వేలు కీలకం కానున్నాయి. నవంబర్ 20 నుండి డిసెంబరు 20 వరకు గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ సర్వే జరగనుంది. డిసెంబర్ 20 తర్వాత సర్వేలో ఏమైనా అభ్యంతరాలు ఉంటె వాటిని స్వీకరించి అర్హులతో కూడిన తుది జాబితా రుపొందిస్తారు. డిసెంబర్ చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి జనవరి 1 నుండి “వైస్సార్ నవశకం” ప్రారంభిస్తారు. జనవరి 1 నుండి ఈ పథకానికి అర్హులైన లబ్దిదారులకు గ్రామ సచివాలయాల నుండి నేరుగా సేవలు అందుతాయి.