iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి జగన్ తీరు పట్ల ప్రజల్లో ఓ బలమైన అభిప్రాయం కలుగుతోంది. చెప్పాడంటే..చేస్తాడంతే అనే ముద్ర పడుతోంది. దానికి తగ్గట్టుగా సీఎం జగన్ పాలనా తీరు కనిపిస్తోంది. తాజాగా తాను చెప్పిన మాటను అమలు పరచచడంలో భాగంగా మరో కొత్త పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుడుతున్నారు. సోమవారం నాడు ప్రారంభోత్సవం జరబోతోంది. వైఎస్సార్ జలకళ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి ఉచితంగా బోరు బావులు తవ్వేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. 2లక్షల బోర్లు తవ్వడం ద్వారా 3లక్షల మంది రైతులకు మేలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు. సుమారుగా 5లక్షల ఎకరాల భూమికి నీటి లభ్యత ఏర్పడుతుందని చెబుతున్నారు.
వైయస్‌ఆర్ జలకళ పథకం కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు కేటాయించింది. దరఖాస్తు నుంచి బోర్ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. శాస్త్రీయంగా భూగర్భజలాల లభ్యతపై అంచనా వేసి ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అనుగుణంగా ఈ భారీ పథకానికి మొగ్గుచూపారు. సాగునీటి కోసం వేల అడుగుల లోతుతో బోరుబావులను తవ్వించుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం, అందుకోసం అప్పులపాలవుతున్న వైనంను గమనించిన జగన్ రైతులు పడుతున్న అవస్థలను పూర్తిగా తొలగించేందుకు ఇచ్చిన హామీ కార్యరూపం దాలుస్తోంది
రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామసచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లోనూ దీనికోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సదరు దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియోలజిస్ట్ కు పంపుతారు. సాంకేతికంగా దానిని జియోలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్ పిడి సదరు దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. సదరు అనుమతి అనంతరం కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ సైట్ లో బోరుబావులను తవ్వుతారు. బోరుబావుల సక్సెస్ శాతంను బట్టి కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులు జరుపుతారు.
ఈపథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేసింది. ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకున్న తరువాత నుంచి దానికి అనుమతులు ఇవ్వడం, బోర్ బావి తవ్వకం, కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించడం వరకు అత్యంత పారదర్శకతతో, నిర్ణీత సమయంలోనే ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రతి దశలోనూ దరఖాస్తు చేసుకున్న రైతుకు తన దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఎస్‌ఎస్‌ఎంల ద్వారా పంపిస్తారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా కూడా తన దరఖాస్తు ఏ దశలో వుందో రైతు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఏ రోజు రైతు పొలంలో బోర్ డ్రిల్లింగ్ చేస్తారో అది కూడా అటు రైతు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా, ఇటు వాలంటీర్ల ద్వారా కూడా సమాచారం అందిస్తారు. ఒకవేళ మొదటిసారి బోర్ డ్రిల్లింగ్ లో నీరు పడక విఫలం అయితే, మరోసారి బోర్ కోసం నిపుణుడైన జియోలజిస్ట్ నిర్ధేశించిన ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు.
పొలాల్లో హైడ్రో జియోలాజికల్, జియోగ్రాఫికల్ సర్వే ద్వారా శాస్త్రీయంగా ఎక్కడ బోరుబావులను తవ్వాలో నిపుణులు గుర్తించిన తరువాతే వాటికి అనుమతి ఇస్తారు. సంబంధిత జియోలజిస్ట్ నిర్ధేశించిన లోతులో మాత్రమే బోరు బావుల తవ్వకం చేపడతారు. ఈ పథకం కింద తవ్వే ప్రతి బోరుబావికి జియో ట్యాగింగ్ చేస్తామని, అదే క్రమంలో భూగర్భజలాలు ఎప్పటికప్పుడు రీచార్జ్ అయ్యేలా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను కూడా కొనసాగిస్తామని మంత్రి చెబుతున్నారు. పర్యావరణానికి నష్టం జరగకుండా, భూగర్భజలాలు అడిగంటి పోకుండా శాస్త్రీయ పద్దతుల్లో బోరుబావుల తవ్వకం జరుగుతుందని, దీనివల్ల రైతుకు కూడా బోర్లు వేసిన కొద్దిరోజులకే బోర్లు అడిగంటి పోవడం, తరువాత మరోసారి బోర్లు వేసుకునేందుకు వ్యయం చేయాల్సిన అవసరం వుందని అంటున్నారు.