వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఈ పేరు విన్నా, తలచుకున్నామన మదిలో మెదిలేది తెలుగు సంస్కృతి ఉట్టిపడే ఒక నిండైన విగ్రహం. తెల్లటి పంచె కట్టుతో, స్వచ్చమైన చిరునవ్వుతో, సిసలైన వ్యక్తిత్వానికి నమూనాలా స్పూర్తిని నింపే ఆ మూర్తిని ఎప్పటికీ మరువలేము. ఆయన ముఖ్యమంత్రిగా పాలించింది ఐదేళ్ల మూడు నెలలే అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ది, సంక్షేమంపై ఆయన సంతకం ఎప్పటికీ చెక్కు చెదరనిది. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి సంక్షేమం.. ప్రభుత్వ బాధ్యతగా భావించి పాలించారు కనుకనే ఆయన ప్రజల గుండె చప్పుడుగా మిగిలిపోయారు. సాధారణ జనమే కాకుండా విపక్ష నేతలు కూడా ప్రజా పక్షపాతిగా ఆయన చేసిన సేవలను మెచుకున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి, చివరికంటా కమ్యూనిస్టుగానే నిబద్ధతతో బతికిన విఖ్యాత రచయిత అవంత్స సోమ సుందర్ వైఎస్ పాలనను పొగడడం అన్నది ఆ మహానేత దార్సినికతకు దక్కిన యోగ్యతాపత్రమని చెప్ప వచ్చు. ఇటీవల జరిగిన వైఎస్సార్ 12వ వర్ధంతి సభలో ఆయన మిత్రుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విషయం వెల్లడించారు.
వైఎస్ గతించిన కొన్ని నెలలకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలొని అవంత్స ఇంటికి వెళ్లిన ఉండవల్లి అక్కడ రాజశేఖరరెడ్డి ఫొటో ఉండడాన్ని చూసి ఆశ్చర్య పోయారు. మంచి పనులు ప్రారంభించి మధ్యలోనే వెళ్లిపోయాడని, కమ్యూనిస్టులు సంకల్పిం చిన పనులను ఆయన ప్రారంభించాడని అవంత్స మెచ్చుకోవడం ఉండవల్లిని కదిలించింది. సాధారణంగా కమ్యూనిస్టులు ప్రభుత్వాలపై చేసే విమర్శకు విలువ ఎక్కువ. విషయ పరిజ్ఞానంతో సాధికారికంగా వారు ప్రభుత్వ లోపాలను ఎండగడతారు. ఎవరి పాలనా వారికి ఓ పట్టాన నచ్చదు. ఆలాంటిది అవంత్స వంటి దిగ్గజం వైఎస్సార్ ను ఎందుకు మెచ్చుకున్నారు?
Also Read : బడేటి బుజ్జి కి ప్రత్యామ్నాయం ఎవరు?
ముందుచూపే చుక్కానిగా..
పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడం ఒక్కటే ప్రభుత్వాల పని కాదని వైఎస్ భావించారు. వారి సమగ్ర అభ్యున్నతికి ముందుచూపుతో ప్రణాళికలు రచించారు. చిత్త శుద్దితో అమలు చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ప్రజా రవాణా వంటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. జలయజ్ఞం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, రైతు రుణాల మాఫీ, 104, 108 సేవలు, ఆరోగ్యశ్రీ, రాజీవ్ గృహకల్ప, గిరిజనుల వ్యవసాయానికి భూముల పంపిణీ లాంటి పథకాలను అమలు చేసి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించారు. తాము అధికారంలోకి వస్తే కమ్యూనిస్టులు చేద్దాం అనుకున్న పనులనే కాకుండా వారి ఊహకు కూడా అందని ఎన్నో మంచి కార్యక్రమాలను వైఎస్ చేసి చూపించారు. ప్రజలకు పథకాలను సంతృప్త స్థాయిలో అందించాలని తపించారు.
30 యేళ్ల రాజకీయ అనుభవం, ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తాను స్వయంగా చూసిన ప్రజల కష్టాలు, జనానికి మేలు చేయాలనే చిత్తశుద్ధి ఆయన ను ఒక విలక్షణ నాయకుడిగా నిలిపాయి. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం అంటే వైఎస్సార్ కు ముందు ఆ తర్వాతగా పరిగణనలోకి తీసుకునే స్థాయిలో ఆయన పాలన గుర్తుండి పోతుంది. అందుకే ఆయన కమ్యూనిస్టులకూ ఇష్టుడయ్యారు.
Also Read : అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు, ఇప్పుడు కర్మ సిద్ధాంతం.. లోకేష్ తీరు