iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో స్వయం సహాయక సంఘాలలోని మహిళల సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం అమలు చేస్తోంది. ఈ పథకంలో రెండో విడతగా గురువారం రూ.6,440 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల..
స్వయం సహాయక సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానని, రుణాలు కట్టొద్దని 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అప్పుల విషయం పట్టించుకోలేదు. దీంతో 2014 నాటికి రూ. 14,204 కోట్లుగా ఉన్న మహిళా సంఘాల రుణాలు అసలు, వడ్డీ కలిపి 2019 ఎన్నికల నాటికి రూ.25,517 కోట్లు చేరాయి. దీంతో చాలా సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి. రుణాలు సకాలంలో చెల్లించని కారణంగా వాటి పరపతి దెబ్బ తిని అప్పటి వరకు ఏ గ్రేడ్ లో ఉన్న సంఘాలు సి, డి గ్రేడ్లకు దిగజారాయి. ఒకవైపు రుణ మాఫీ హామీ అమలు చేయకపోగా 2016 అక్టోబరు నుంచి సున్నా పథకం సైతం గత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కారణంగానే అప్పులు తడిసీ మోపెడు అయ్యాయి. సుమారు రూ. 3,036 కోట్ల వఢ్ఢీని మహిళలు బ్యాంకులకు అపరాధపు వడ్డీ తో చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది.
పాదయాత్రలో మాట ఇచ్చిన జగన్
మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను తన ప్రజా సంకల్ప పాదయాత్రలో చూసి వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహనరెడ్డి చలించిపోయారు. ఎన్నికల తేదీ నాటికి అంటే 11.4.2019 వరకు మహిళల పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి ఖాతాల్లొనే జమ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు.
Also Read : ఏపీలో ఆ పధకం తెచ్చిన మార్పులు ఏమిటి..?
ఇచ్చిన మాటకు కట్టుబడి..
గత రాజకీయ పార్టీలకు భిన్నంగా మేనిఫెస్టోను తూ.చ. తప్పక అమలు చేస్తున్న జగన్మోహనరెడ్డి ఈ హామీని కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లొని సుమారు 78.76 లక్షల మంది మహిళలకు ఊరటనిస్తున్నారు. ఈ రుణాల మాఫీకి వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడతగా గత సంవత్సరం రూ. 6,319 కోట్లు మహిళల పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేశారు. రెండో విడతగా ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సొమ్ము జమ చేయనున్నారు. దీనిని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ రెండో విడతలో దాదాపు రూ.6,440 కోట్లు జమ చేయనున్నారు. దీంతో కలిపి రెండు విడతల్లో మహిళ పొదుపు సంఘాల ఖాతాల్లో ఇప్పటి వరకు జమ చేసింది రూ. 12,759 కోట్లు.
సున్నా వడ్డీ పథకం పునరుద్ధరణ..
2016లో తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసిన సున్నా వడ్డీ పథకాన్ని జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చాక పునరుద్ధరించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంగా మొదలు పెట్టి కొనసాగిస్తున్నారు. ఈ పథకం ద్వారా 9.41 లక్షల స్వయం సంఘాలలోని 98 లక్షల మంది మహిళలకు ఈ రెండేళ్లలో రూ. 2,362 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఏటా సరైన సమయంలో రుణాలు చెల్లిస్తూ మహిళలపై ఏ మాత్రం వడ్డీ భారం పడకుండా ప్రభుత్వమే నేరుగా సున్నా వడ్డీ చెల్లిస్తోంది. దీంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి. గత ప్రభుత్వంలో సి,డి గ్రేడ్ లోకి దిగజారిన సంఘాలు ప్రభుత్వం అందించిన సహకారంతో తిరిగి ఏ గ్రేడ్ లోకి చేరాయి.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
మహిళల సంక్షేమం, స్వావలంబన, సాధికారత ధ్యేయంగా వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేస్తున్న జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమ రుణాలు తీర్చి, పరపతి పెంచి సమాజంలో తాము తలెత్తుకు తిరిగేలా సాయమందించిన ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ రుణ పడి ఉంటామని ఆనందంగా చెబుతున్నారు.
Also Read : జగన్ ఏం చెప్పారో.. అదే చేస్తున్నారు..