వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి(నవంబర్ 1) మరో మూడు రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన పేదలు శుక్రవారం ఉదయం నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనూ నిర్ణయించిన ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే అవకాశం కలుగుతోంది. సుమారు 17 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు ఈ మూడు నగరాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై గత నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇప్పటి వరకు సొంత రాష్ట్రంలో సరైన వైద్య సేవలు లభించక, ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే వెసులుబాటు లేక రాష్ట్రంలోని వేలాదిమంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే.. తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. తాజా జీవోను అనుసరించి.. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారెవరైనా రాష్ట్రంలో గానీ లేదా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో గానీ వైద్యసేవలు పొందవచ్చు. 2020 జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ జాబితాలో కొత్తగా 1,200 జబ్బులకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. వెరసి మొత్తం 2 వేల జబ్బులకు వర్తించనుంది. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రభుత్వం అమలు చేయనుంది,