iDreamPost
iDreamPost
కొందరి వల్ల కొన్నింటికి ప్రాధాన్యత వస్తుంది. ప్రాధాన్యత కలిగిన వాటితో అనుబంధం మూలంగా ఇంకొందరు ప్రాధాన్యత సాధిస్తారు. కానీ ఒకే తేదీన పుట్టిన ఇద్దరు నేతలు కారణంగా ఈ తేదీకే కాకుండా, వారు ప్రాతినిధ్యం వహించిన పార్టీలకు, ప్రాంతాలకు కూడా మంచి గుర్తింపు దక్కింది. అందుకే ఉద్దండులైన ఇద్దరు నేతలు జనహృదయ విజేతలుగా మిగిలిపోయారు. చిరకాలం వారి స్మృతులను నెమరవేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ప్రజా సంక్షేమంలోనూ, పాలనా విధానంలోనూ తమ పేరు ప్రస్తావించక తప్పని స్థితిని తీసుకొచ్చారు. వారిలో సుదీర్ఘకాలం సీఎం హోదాలో తిరుగులేని రీతిలో పాలన సాగించిన జ్యోతిబసు ఒకరు కాగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం తక్కువే అయినా ఎక్కువ మంది మనసులో నిలిచిపోయిన నేతగా మారిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరొకరు. కాకతాళీయంగానే అయినా ఈ ఇద్దరు నేతలు జూలై 8నాడే జన్మించడం విశేషం.
ప్రధాని పదవికి నిజమైన అర్హుడిగా అందరి మనసుల్లో మెలిగిన నేత అయినప్పటికీ కేవలం పార్టీ నిర్ణయానికి కట్టుబడిన కమ్యూనిస్ట్ నేతగా జ్యోతిబసు చరిత్రలో నిలిచిపోయారు. దేశంలోనే కీలకమైన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన ఘనత దక్కించుకున్నారు. బ్రిటన్ లో విద్యాభ్యాసం చేసి, బెంగాల్ లో కార్మికనాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత ఆ రాష్ట్ర రైతాంగ, కార్మిక ఉద్యమాల్లో ఎదిగిన జ్యోతిబసు తొలుత ఉప ముఖ్యమంత్రిగా, తర్వాత ముఖ్యమంత్రిగా తన నిర్ణయాలతో చెరగని ముద్ర వేశారు. పాలనా సంస్కరణలకు పెట్టింది పేరుగా నిలిచారు. కౌలుదారులకు రక్షణ కల్పించిన మొదటి ముఖ్యమంత్రిగానూ, స్థానిక పరిపాలనలో చొరవ చూపించి దేశమంతటికీ స్ఫూర్తిదాయకంగా మారడంలోనూ, రేషన్ దుకాణాల ద్వారా అప్పట్లోనే 16 రకాల సరుకులు పంపిణీ చేయడం ద్వారాను ఆయన సామాన్యులకు చేరవయ్యారు. ఇక పాలనలో ఆయన చూపించిన సమైక్యతా భావం కారణంగా దేశమంతా మత ఘర్షణలు సాగిన సమయంలో కూడా సామరస్యంగా సాగింది. అన్ని తరగతులను కలిపి ఉంచడంలో జ్యోతిబసు సమర్థత కారణంగా బాబ్రీ మసీదు ఘర్షణల సమయంలో కూడా బెంగాల్ శాంతియుతంగా కనిపించింది. ప్రజల్లో ఐక్యతను పెంపొందించి, సమర్థవంతమైన పాలనను అదించడం ద్వారా వరుసగా ఆరు ఎన్నికల్లో ఆయన నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టిన విధానం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కమ్యూనిస్టులు సాధించిన అరుదైన విజయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది.
ఇక తెలుగు వారి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అరుదైన నాయకత్వ ఘనతతో ఎదిగిన నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మారిన నేపథ్యం అందరికీ తెలిసిందే. అయితే ఆయన పార్లమెంట్ , అసెంబ్లీ లకు కూడా ప్రాతినిధ్యం వహించి ఎక్కడి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ వ్యవహరించడం ద్వారా అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారు. పార్లమెంట్ పద్దతులకు అనుగుణంగా హస్తినలో వ్యవహరిస్తే, హైదరాబాద్ అసెంబ్లీలో ఆనాటి పద్ధతులను ఆకళింపు చేసుకుని ప్రతిపక్ష నేత హోదాలో సుదీర్ఘపాదయాత్ర చేపట్టిన ప్రజా ప్రస్థానం ఆయన జీవితం. అందుకే విపక్షంలో ఉన్న సమయంలో ఆయన ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా తన అనుభవాన్ని రంగరించి పాలనను కొత్త పుంతలు తొక్కించారు. అధిష్టానం కూడా ఆయన మాట కాదనలేని పరిస్థితిని తీసుకొచ్చారు. జాతీయ పార్టీలో ప్రాంతీయంగా తిరుగులేని స్థాయిలో ఆయన రాజకీయాలు నడిపారు. నమ్మిన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఆయన ధోరణి రాష్ట్ర వ్యాప్తంగా అనుచరులను, అభిమానులను సంపాదించి పెట్టింది. ఆయన మాటే వేదవాక్కుగా ఆచరణలో పెట్టే బృందాన్ని ఆయన దగ్గరకు చేర్చింది.
పాలనలో వైఎస్సార్ తీరు ఓ మైలురాయి. ఆయన స్థాయికి చేరడానికి ఆ తర్వాత ముఖ్యమంత్రులు ప్రయత్నం చేస్తే, అందరినీ ఆయనతో పోల్చుకునే పరిస్థితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉందంటేనే చెప్పవచ్చు. నేటికీ వైఎస్సార్ ఉంటే అలా ఉండేది..ఇలా జరిగేది అనుకునే సామాన్య జనానికి లోటు లేదు. జ్యోతిబసులా కాకుండా కేవలం ఆరు సంవత్సరాల మూడు మాసాల కాలం మాత్రమే వైఎస్సార్ రాజ్యం నడిచింది. అప్పట్లో తన పార్టీ కాంగ్రెస్ కన్నా మించి వైఎస్సార్ ఇమేజ్ పెరగడం గమనిస్తే పాలనా విధానంలో పటుత్వం బోధపడుతుంది. ఉచిత విద్యుత్ తో మొదలుకుని విన్నూత కార్యక్రమాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఇప్పటికీ పల్లెల్లో కుయ్ కుయ్ మంటూ ఆంబులెన్స్ కదిలితే వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108, పల్లెల్లో కూడా గుండెజబ్బులు వంటి వస్తే ఆరోగ్య శ్రీ ప్రారంభంలో ఆయన పేరు ప్రస్తావనకు రాకుండా పోదు. ఇక ఫీజు రీయంబర్స్ మెంట్ ఫలితంగా ఉన్నత విద్యనభ్యసించిన సామాన్యులు ఇప్పుడు వివిధ స్థాయిల్లో ఎదగడానికి దోహదపడిన వైఎస్సార్ గుర్తు రాకుండా పోరనే చెప్పవచ్చు. ఇలాంటి విభిన్న పథకాలను ఆయన తర్వాత కూడా ప్రభుత్వాలు, పార్టీలు, వ్యక్తులు, విధానాలు మారినా ఆచరించడం, అనుసరించడం తప్పనిసరిగా మారిందంటే వైఎస్సార్ ముద్ర బోధపడుతుంది.
జ్యోతిబసు, వైఎస్సార్ కూడా ఇద్దరూ ఇద్దరే అనదగ్గ నేతలు. తమ తమ రాష్ట్రాల్లో తరాలు మారినా తరగని ఇమేజ్ సొంతం చేసుకున్న ముఖ్యమంత్రులు. అదే సమయంలో ఇద్దరూ రైతుబాంధవులు. గ్రామీణ జీవనంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన వారు. జ్యోతిబసు పాలనలో రైతుల ఆత్మహత్యలు లేని బెంగాల్ ని చూస్తే, వైఎస్సార్ పాలనలో ఆత్మహత్యలు పాల్పడే స్థితి నుంచి రైతుని వ్యవసాయం దండగ కాదు..పండుగగా మార్చే స్థితికి చేర్చే ప్రయత్నం జరిగింది. తద్వారా రైతుల్లో ఇరువురు నేతలు తిరుగులేని స్థానంలో మిగిలిపోయారు. అంతేగాకుండా ఈ ఇద్దరూ తమ పార్టీల కీర్తిని పెంచే నేతలుగానే కాకుండా తమ రాష్ట్రాలకు మంచి ఖ్యాతిని సాధించడానికి కూడా కారణమయ్యారు. అభివృద్ధి విషయంలో వైఎస్సార్ వేసిన పునాదులు నేడు అనేకం అనుభవంలో అందరికీ అవకాశంగా మారగా, పోలవరం వంటి కలల ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడానికి సిద్ధమవుతున్నాయి. జలయజ్ఞంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రదర్శించిన చొరవ కారణంగా కేవలం సంక్షేమ సారధిగానే కాకుండా, అభివృద్ధి వారధిగానూ అందరి మదిలో మిగిలారు.
జ్యోతిబసు జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఆచరణలో చూపించి, సామాన్యుల ముఖ్యమంత్రిగా మిగిలితే, వైఎస్ కొందరి వాడిగా అధికారం దక్కించుకున్నప్పటికీ అందరి వాడిగా మారడం విశేషం. ఆ క్రమంలో ఇద్దరూ స్వయంకృషితో ఎదిగిన నేతలే కాకుండా, తమ బాటలో అనేక మందిని తీర్చిదిద్దిన మార్గధర్శకులు. ముందుచూపున్న నేతలు. ముందు ముందు తరాలు కూడా మాట్లాడుకోదగ్గ మహానేతలు. మంది శ్రేయస్సు కోరి మనసు పెట్టి మంచి పనులకు శ్రీకారం చుట్టిన నాయకులు. జనం మనసులో మహానుభావులుగా మిగిలిపోయే ఆ ఇద్దరికీ వారి జయంతుల సందర్భంగా నివాళి అర్పిద్దాం…