iDreamPost
iDreamPost
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాజకీయ చర్చ మొదలైంది. 12 వ వర్ధంతిని పురస్కరించుకుని విజయమ్మ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం దానికి కారణమైంది. హైదరాబాద్ నోవాటేల్ వేదికగా ఎల్లుండి సాయంత్రం ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే వైఎస్సార్ ఆత్మీయులు కొందరికి ఆహ్వానం అందింది. వివిధ పార్టీలలో ఉన్న నేతలను కూడా ఆహ్వానించారు. దాంతో ఇది చర్చనీయాంశంగా ఉంది.
వైఎస్ విజయమ్మ ఇటీవల హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. మొన్నటి జులై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా కూడా షర్మిలతో కలిసి ఇడుపులపాయకు వెళ్లి నివాళి అర్పించి వచ్చారు. ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన సభలో షర్మిల తన సొంత పార్టీ ప్రకటన చేశారు, విజయమ్మ దానికి హాజరయ్యారు.
Also Read:నాలో నాతో వైఎస్సార్–విజయమ్మ
గత ఏడాది విజయమ్మ “నాలో నాతొ YSR” పేరుతొ ఒక పుస్తకం ఆవిష్కరించారు. వైఎస్సార్ తో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను చాటే రీతిలో పుస్తకం అందరినీ ఆకట్టుకుంది. కోవిడ్ కారణంగా ఆ పుస్తకావిష్కరణ కొద్దిమంది ఆహ్వానితులతో నిరాడంబరంగా జరిగింది. కానీ ఏడాది దానికి భిన్నంగా వివిధ పార్టీల్లో ఉన్న ఆనాటి వైఎస్సార్ సన్నిహితులను,జర్నలిస్ట్ మిత్రులను,శ్రేయోభిలాషులును ఆహ్వానించి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం ఆసక్తికరం . ఇప్పటికే ఉభయ తెలుగురాష్ట్రాలకి చెందిన కాంగ్రెస్, టీఆరెస్ తో పాటుగా టీడీపీలో ఉన్న మాజీ మంత్రులకు కూడా ఆహ్వానం అందింది. జగన్ మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నేతలను కూడా స్వయంగా విజయమ్మ ఆహ్వానించారు.
ఈ సమావేశానికి కేవీపీ, ఉండవల్లి , డి శ్రీనివాస్ సహా ఇటీవల రాజకీయంగా క్రియాశీలకంగా లేని నేతలను కూడా పిలిచారు. దాంతో వారు హాజరయ్యే ఆ అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. టీడీపీ లో ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కి ఆహ్వానం ఉన్నప్పటికీ వెళ్లాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. టీఆరెస్ కి చెందిన కేశవరావు, సురేష్ రెడ్డివంటి వారి హాజరు కూడా అనుమానమే. అయితే కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరా, రోశయ్య వంటి వారు రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కీలక నేతలు మాత్రం మొఖం చాటేసే ఛాన్స్ ఉందని ప్రచారం. షర్మిల కూడా పాల్గొంటున్న సమావేశానికి తెలంగాణ నేతలు వెళ్లాలా వద్దాఅనేది ఊగిసలాటలో ఉన్నట్టు చెబుతున్నారు. ఏమైనా ఈ సమావేశం, హాజరయ్యే నేతల చుట్టూ చర్చ సాగుతోంది.