Idream media
Idream media
లక్షలాది మంది పేదల సొంతింటి కల నెరవేర్చేకార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 25వ తేదీన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా సిద్ధమైంది. ఇళ్ల స్థలాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని భారీ లే అవుట్ ప్రాంతంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులతో కలిసి కలెక్టర్.. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్ నుంచి మోడల్ హౌస్, పైలాన్ ప్రాంతం మీదుగా సభావేదిక వద్దకు ముఖ్యమంత్రి చేరే మార్గాన్నిపరిశీలించారు. పారిశుద్ధ్య చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం తదితరాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కొమరగిరి లేఅవుట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ వంగా గీతా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమం విజయవంతమయ్యేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులకు సూచనలిచ్చారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 29 వేల మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రొసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలో ఇళ్ళ పట్టాల పంపిణీ, 25న జిల్లాలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్షించి ముఖ్యమంత్రి పర్యటనను అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎంతటి విపత్కర పరిస్ధితులు ఎదురైన రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆపద సమయంలో అన్ని వర్గాల వారిని ఆదుకున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ స్ధలాలకు సంబంధించి అన్నిలేవుట్లలో త్రాగునీరు, విద్యుత్, రవాణా, ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అర్హతలు ఉండి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 90 రోజుల్లోనే ఇళ్ళ పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. ఇళ్ళ స్ధలాలకు సంబంధించి అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం లబ్దిదారుల జాబితా ప్రతీ గ్రామ సచివాలయంలోను ప్రదర్శించడం జరిగిందన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 29 వేల మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు : బొత్స
ఇళ్ల పట్టాల పంపిణీపై రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మాట్లాడారు. రేపు పేదల సొంతింటి కల నెరవేర్చే రోజు అని అన్నారు. తొలుత 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. తొలివిడతలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేపడతామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ‘ఇంత పెద్దఎత్తున పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. 300 ఎస్‌ఎఫ్‌టి ఇళ్లను ఒక్క రూపాయికే అందిస్తున్నాం. స్థలం ఉండి పాకలో ఉండే పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందిస్తాం. 15.60 లక్షల ఇళ్లకు రూ.1.80 లక్షల చొప్పున లబ్ధిదారులకు ఇస్తాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 17 వేల కొత్త టౌన్‌షిప్‌లు వస్తాయి. రూ.23,538 కోట్ల విలువైన భూమిని పేదలకు అందిస్తున్నాం. రాజకీయాలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు’ అని అన్నారు.