ఒకవైపు కోవిడ్ 19 కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గత పదిహేను రోజులుగా ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్‌ను పరిశీలిస్తే దాదాపుగా 8 వేల నుంచి 10వేలకుపైగా పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటకీ వైరస్ కారణంగా ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మరోవైపు బైటపడుతున్న వైరస్ బాధితుల సంఖ్యకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా పరీక్షలను చేస్తోంది. ప్రతి రోజు డెబ్బైవేలకు పైగా టెస్టులు చేస్తోంది. రోజురోజుకూ బైటపడుతున్న సంఖ్య భారీగా ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాదనం కూడా ఖర్చు చేయాల్సి వస్తోంది.
అయితే ఈ స్థాయిలో వైరస్ ప్రభలడానికి కారణంగా యువతేనన్న వాదన విన్పిస్తోంది. 20–40 ఏళ్ళ మధ్య వయస్కులు ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న నేపథ్యంలోనే వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందని భావిస్తున్నారు. బృందాలుగా, గుంపులుగా సంచరించడం కన్పిస్తోంది. మాస్కు ధరించడం గానీ, భౌతిక దూరం పాటించడం గానీ చేయడం లేదు. ఒకే బైక్‌పై త్రిబుల్రైడింగ్లతో దూసుకుపోతున్నారు. గత నెల రోజుల వ్యవధిలోని ఏపీలో దాదాపు రెండున్నరలక్షలకుపైగా పాజిటివ్‌లు బైటపడ్డాయి. వీరిలో 40 ఏళ్ళలోపు ఉన్నవారే సగం మందికిపైగా ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా 20–30 ఏళ్ళ మధ్యనున్న వారిలో కూడా పాజిటివ్‌లు ఎక్కువగా బైటపడుతున్నాయి. వీరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. ప్రాణాలకు ప్రమాదం కలిగే పరిస్థితులు ఉండడం లేదు.
ఈ నేపథ్యంలో వీరిలో అత్యధికశాతం మంది హోం క్వారంటైన్‌ను ఖచ్చితంగా పాటించకుండా విచ్చలవిడిగా జనసమూహాల్లోకి చేరుతున్నట్లుగా భావిస్తున్నారు. వీరి ద్వారానే విస్తృత వైరస్ వ్యాప్తి జరుగుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పెద్దగా లక్షణాలు కన్పించకపోయినప్పటికీ వీరి ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. వీరి ద్వారా వైరస్ భారిన పడితే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పరిస్థితి విషమిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం యువతరం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. తమకు ప్రమాదం లేదు కాబట్టి విచ్చలవిడిగా తిరిగే అది తమ కుటుంబ సభ్యులకే ముప్పుగా పరిణమించే పరిస్థితి ఎదురుకావొచ్చని గుర్తించాలని సూచిస్తున్నారు.