iDreamPost
android-app
ios-app

అయోధ్యలో యోగి ప‌్రత్యేక పూజ‌లు

అయోధ్యలో యోగి ప‌్రత్యేక పూజ‌లు

ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ జన్మభూమిలో “భూమి పూజ” జరగనుంది. ఈ మేర‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ శ‌నివారం అయోధ్య‌లో ప‌ర్య‌టించారు. భూమి పూజకు సంబంధించి జరుగుతున్న పనులను ప‌రిశీలించారు. అక్క‌డ రామ ‌జ‌న్మ‌భూమిలో ఉన్న శ్రీరాముడికి పూజ‌లు చేశారు.

భ‌ర‌త‌, శ‌తృజ్ఞ‌, ల‌క్ష్మ‌ణుల‌కు కూడా సీఎం యోగి పూజ‌లు నిర్వ‌హించారు. శంకుస్థాప‌న గురించి శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్ట్‌, స్థానిక అధికారుల‌తో యోగి చ‌ర్చించారు. హ‌నుమాన్ గ‌ర్హిలో ఉన్న హ‌నుమంతుడికి కూడా యోగి పూజ‌లు చేశారు. ఆయ‌న త‌ర్వాత ఆయ‌న‌.. ప్ర‌త్య‌క్షంగా ప‌నులు ప‌ర్య‌వేక్షించారు. రామాల‌యం కోసం తెచ్చిన శిల‌ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. శంకుస్థాప‌న కోసం అయిదు వెండి ఇటుక‌ల‌ను కూడా తీసుకువ‌చ్చారు. విశ్వ‌హిందూ ప‌రిష‌త్ త‌యారు చేసిన డిజైన్ ప్ర‌కార‌మే ఆల‌యాన్ని నిర్మించ‌నున్నారు.

40 కేజీల వెండి ఇటుక‌లు

ఆలయ నిర్మాణ భూమి పూజ ఆగస్టు ఐదున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుందని ట్రస్టు ఇప్ప‌టికే తెలిపింది. విశ్వహిందూ పరిషత్​ ప్రతిపాదన మేరకు రామ మందిర నమూనాను ఖరారు చేశారు. ఎత్తు, వెడల్పు మాత్రం పెంచారు. నిర్మాణ పనులు మూడున్నర ఏళ్ల పాటు జరగనున్నాయి. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ పనులు కరోనా పరిస్థితుల కారణంగా ఆలస్యమయ్యాయి.

రామమందిరం నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఐదున ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మరికొందరు ప్రముఖులు పాల్గొననున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌కు కూడా రామమందిరం పూజారులు ఆహ్వానం పంపారు. దాదాపు 100 మంది వీవీఐపీలు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు.

భూమిపూజ సందర్భంగా గర్భగుడి లోపల ఐదు వెండి ఇటుకలను అమర్చనున్నారు. ఇందులో మొదటి ఇటుకను ప్రధాని అమర్చనున్నారు. హిందూ పురాణాల ప్రకారం ఐదు ఇటుకలు ఐదు గ్రహాలకు ప్రతీక. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతిపాదించిన మాదిరిగానే ఆలయ రూపకల్పనతోపాటు నిర్మాణం ఉండనుంది. మునుపటి డిజైన్‌తో పోలిస్తే గుడి పొడవు, వెడల్పుతోపాటు ఎత్తును పెంచనున్నారు. సుమారు 40 కేజీల వెండి ఇటుక‌ల‌ను రామమందిరం నిర్మాణంలో ఉప‌యోగించ‌నున్నారు.