iDreamPost
android-app
ios-app

అయ్యో డేవిడ్‌రాజు..!

అయ్యో డేవిడ్‌రాజు..!

పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ చట్టం తెచ్చినా.. అందులోని లోపాలతో అవి యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒక పార్టీ తరఫున గెలిచి.. మరో పార్టీలోకి చేరిన వారిని మళ్లీ ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తున్నారు. అంటే.. ఫిరాయింపులకు ప్రజల ఆమోదం ఉన్నట్లే. అయితే ఫిరాయించిన నేతల రాజకీయ జీవితం.. వారి వ్యక్తిగత బలంపై ఆధారపడి ఉంటుందని యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

రెంటికీ చెడ్డ రేవడిలా..

మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జి పదవి ఆశించారు. అయితే డేవిడ్‌రాజు సాగించిన రాజకీయ పయనం ఆయన్ను రెంటికీ చెడ్డరేవడిలా మార్చింది. 1999లో టీడీపీ తరఫున సంతనూతలపాడు నుంచి అసెంబ్లీకి ఎన్నికైన డేవిడ్‌రాజు.. ఆ తర్వాత 2014 వరకు గెలుపుముఖం చూడలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరి యర్రగొండపాలెం కో ఆర్డినేటర్‌గా పని చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా.. ఇచ్చిన మాట ప్రకారం డేవిడ్‌రాజుకే వైఎస్‌ జగన్‌ సీటు ఇచ్చారు. ఆదిమూలపు సురేష్‌ను సంతనూతలపాడు పంపారు.

నమ్మిన వారిని నట్టేట ముంచి..

డేవిడ్‌ రాజుకు వైఎస్‌ జగన్‌ ఇంత ప్రయారిటీ ఇచ్చినా.. 2017లో టీడీపీలోకి ఫిరాయించారు. చంద్రబాబు కాళ్లు మొక్కి.. అభివృద్ధి కోసం చేరుతున్నానంటూ ప్రకటించారు. దాదాపు మూడేళ్లు టీడీపీలోనే ఉన్నారు. అయితే ప్రజా తీర్పునకు విరుద్ధంగా డేవిడ్‌రాజు వ్యవహరించడంతో.. చంద్రబాబు కూడా డేవిడ్‌ రాజుకు హ్యాండ్‌ ఇచ్చారు. 2019లో టిక్కెట్‌ నిరాకరించారు. 2014లో పోటీ చేసి ఓడిపోయిన బూదాల అజితకు మరోసారి టిక్కెట్‌ఇచ్చారు. వైసీపీ తరఫున ఈ సారి ఆదిమూలపు సురేష్‌ పోటీ చేసి గెలిచారు. డేవిడ్‌రాజు ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. అయితే ఆయన చేరిన విషయం నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు కూడా తెలియదు.

Also Read : బీసీ జనార్దన్ రెడ్డికి నెల రోజుల తర్వాత బెయిల్.. ఇంతకీ ఏమైంది?

ఫిరాయింపే.. రాజకీయ సమాధి..

డేవిడ్‌రాజు టీడీపీ తరఫున ఒకసారి, వైసీపీ తరఫున మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. అది ఆయా పార్టీల బలమే. సొంత బలంలేని డేవిడ్‌రాజు.. 2017లో పార్టీ ఫిరాయించాలని తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ జీవితానికి చమరగీతం పాడిందని చెప్పవచ్చు. తరచూ పార్టీలు మారడంతో ఆయా పార్టీల అధినేత నమ్మకాన్ని డేవిడ్‌రాజు కోల్పోయారు. ఫలితంగా రాజకీయాల నుంచే దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు.

విశ్వాసంతో ఉన్న గూడూరికి ఛాన్స్‌..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. తనకు పదవి ఇవ్వలేదంటూ డేవిడ్‌ రాజు అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీలు మారే వారికి ప్రాధాన్యత ఉండదంటూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుండబద్ధలు కొట్టారు. దీంతో వైసీపీలో తనకు భవిష్యత్‌లేదని గ్రహించిన డేవిడ్‌ రాజు.. మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు, అయితే స్థానిక టీడీపీ కేడర్‌ త్రీవంగా వ్యతిరేకించడంతో డేవిడ్‌రాజు ముందరి కాళ్లకు బంధం పడింది. యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జిగా టీడీపీలో ఆది నుంచి విశ్వాసంగా కొనసాగుతున్న కనిగిరి నియోజకవర్గానికి చెందిన లిడ్‌ క్యాప్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ఎరిక్షన్‌బాబుకు దక్కింది.

డేవిడ్‌ రాజు జీవితం ఓ గుణపాఠం..

62 ఏళ్ల డేవిడ్‌ రాజు రాజకీయ పయనం టీడీపీతోనే మొదలైంది. ఒంగోలుకు చెందిన డేవిడ్‌రాజు తొలి నాళ్లలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనుచరుడిగా ఉన్నారు. 30 ఏళ్ల వయస్సులోనే నాగులుప్పలపాడు మండలాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. టీడీపీలో బాబు హాయం ప్రారంభమైన తర్వాత దగ్గుబాటికి హ్యాండ్‌ ఇచ్చిన డేవిడ్‌ రాజు బాబు పంచన చేరారు. 1995లో ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 35 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగిన డేవిడ్‌ రాజు.. 62 ఏళ్లకే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యక్తిగత బలం లేకుండా పార్టీలు ఫిరాయిస్తే.. రాజకీయ భవిష్యత్‌ ఉండదనేందుకు డేవిడ్‌ రాజు ఉదంతమే ఓ నిదర్శనం. 

Also Read : మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఎరిక్షన్‌ బాబు ఢీ కొట్టగలరా..?