iDreamPost
android-app
ios-app

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్.. కర్నూలు జెడ్పీ ఛైర్మన్‌గా పాపిరెడ్డి

  • Published Jan 04, 2022 | 10:36 AM Updated Updated Jan 04, 2022 | 10:36 AM
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్.. కర్నూలు జెడ్పీ ఛైర్మన్‌గా పాపిరెడ్డి

పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం చేస్తారని.. ఇచ్చిన మాటను సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటారని మరోసారి రుజువైంది. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఎర్రబోతుల వెంకటరెడ్డి కుటుంబానికి గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఆయన కుమారుడు పాపిరెడ్డిని జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోబెట్టారు. మంగళవారం జరిగిన ఛైర్మన్‌ ఎన్నికలో పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే జెడ్పీ ఛైర్మన్‌గా ప్రమాణం కూడా చేశారు.

గతంలో వెంకట రెడ్డికి టికెట్..  

గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ జెడ్పీ ఛైర్మన్‌ పదవి కూడా దక్కించుకునేందుకు సిద్ధమైంది. కొలిమిగుండ్ల జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రబోతుల వెంకట రెడ్డిని పార్టీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. అయితే దురదృష్టవశాత్తు ఛైర్మన్‌ ఎన్నికకు ముందే ఆయన మృతి చెందారు.దాంతో గత సెప్టెంబర్ 25న జరిగిన ఛైర్మన్‌ ఎన్నికల్లో సంజామల జెడ్పీటీసీ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. అయితే ఎర్రబోతుల మృతితో ఖాళీ అయిన కొలిమిగుండ్ల జెడ్పీటీసీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వెంకటరెడ్డి కుమారుడు పాపిరెడ్డి గెలిస్తే అతనికే జెడ్పీ ఛైర్మన్‌ పదవి ఇస్తామని అప్పట్లోనే సీఎం జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలో ఎర్రబోతుల కుమారుడు పాపిరెడ్డి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు.

ఏకగ్రీవంగా ఎన్నిక.. 

పాపిరెడ్డి జెడ్పీటీసీగా ఎన్నికవ్వడంతో జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు పార్టీపరంగా చర్యలు చేపట్టారు. పార్టీ సూచన మేరకు అధ్యక్షుడిగా ఉన్న వెంకట సుబ్బారెడ్డి డిసెంబర్ 18న పదవికి రాజీనామా చేశారు. దాంతో ఛైర్మన్‌ ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ కోటేశ్వరరావు అదే నెల 28న నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ మేరకు మంగళవారం జిల్లాపరిషత్ భవనంలో కలెక్టర్ నేతృత్వంలో ఎన్నిక నిర్వహించారు.

వైఎస్సార్సీపీ తరపున కొలిమిగుండ్ల జెడ్పీటీసీ ఎర్రబోతుల పాపిరెడ్డి పేరును మహానంది జెడ్పీటీసీ కె.ఆర్.మహేశ్వర రెడ్డి ప్రతిపాదించగా మిడుతూరు జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, వెల్దుర్తి జెడ్పీటీసీ సుంకన్నలు బలపరిచారు. వేరే పేర్లేవీ ప్రతిపాదనకు రాకపోవడంతో పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

Also Read : జగన్‌కు ప్రజలే ప్రాధాన్యత .. ఇదిగో నిదర్శనం..