iDreamPost
android-app
ios-app

అమరావతిలో “ఆ” మీడియా పాత్ర ఏంటి?

అమరావతిలో “ఆ” మీడియా పాత్ర ఏంటి?

ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి పేరిట చంద్రబాబు చేసిన హడావిడిని ప్రజలు ఎవరూ మరిచిపోరు. కానీ రాజధాని నిర్మాణం గురించి పట్టించుకోకుండా తమ వారికి భూముల వితరణకే చంద్రబాబు పరిమితం కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

గత ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణానికి అంకుర్పారణ చేసిన రోజు అక్టోబర్ 22, 2015. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేటికీ ఐదు సంవత్సరాలు అయింది. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా ఇవాళ ప్రత్యేకంగా కథనాలను ప్రచురించింది. ‘ఆశల పునాదికి సమాధి’ అంటూ రాజ గురువు పత్రిక ఓ పెద్ద విశ్లేషణ రాసుకొచ్చింది. మూడు రాజధానుల పేరిట వైసీపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి రాజధానిని తరలిస్తోందని రామోజీ రావు ఎంతో బాధను వ్యక్తం చేశారు.

ఆశల సౌధానికి వైసీపీ ప్రభుత్వం బీటలు చేసిందంటూ ఈనాడు విషం చిమ్మింది. రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు 33 వేల ఎకరాలు చంద్రబాబుని చూసి ఇచ్చారని వారి పరిస్థితి ఏంటని రామోజీ గారు విచారాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆర్కే గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదుగా. ‘అమరావతి ఆశలు ఆవిరి’ అంటూ రాధాకృష్ణ గారు తనకు అనిపించిందంతా రాసుకొచ్చారు. ఈ కథనాలను పరిశీలిస్తే ‘ఆత్మ స్తుతి…పర నింద’లా సాగింది.

అప్పుడేమి చేశారు

రాష్ట్ర విభజనతో ఏపీకి ఆర్థికంగా భారీ లోటు ఏర్పడింది. ఈ సమయంలో ప్రపంచ స్థాయి రాజధాని అంటూ చంద్రబాబు హడావిడి చేస్తుంటే ఎల్లో మీడియా అధినేతలు వారించడం మరిచిపోయారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం ‘బాహుబలి’ డిజైన్లు చేయిస్తే అవే నిజమైన కట్టడాలనే రేంజ్ లో ఎల్లో మీడియా చేసిన ప్రచారాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబు ఏ దేశం పోతే ఆ దేశ స్థాయి రాజధాని అంటూ చెప్పిన మాటలను మెయిన్ పేజీ వార్తలుగా కవర్ చేసిన ఈ మీడియా సంస్థలు నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయని ఒక్క వార్త కూడా ప్రచారం చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. కానీ ఆ విమర్శలను కూడా పట్టించుకోని ఆ మీడియా సంస్థలు అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అంటూ ఊదరగోట్టాయి.

‘ల్యాండ్ పూలింగ్’ పేరిట చంద్రబాబు తీసుకువచ్చిన విధానం సూపర్ అంటూ ఆ మీడియా సంస్థలు భజన చేశాయి. ఆ విధానమే అమరావతి రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. విభజన కష్టాలతో లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి ‘ల్యాండ్ పూలింగ్’ విధానంలో రైతులకు డబ్బులు ఇవ్వాలంటే కష్టంగా మారింది. ఆవగింజ నుంచి అమెరికా ప్రెసిడెంట్ వరకు తమ ఉద్దేశాలను వారి సిద్ధాంతాలుగా ప్రచారం చేసిన ఆ మీడియా సంస్థల అధినేతలకు ‘ల్యాండ్ పూలింగ్’ విధానం తప్పని తెలియక కాదు. కానీ చంద్రబాబు ఏ టర్న్ తీసుకుంటే ఆ అధినేతలు ఆ టర్న్ తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

మోసపూరిత విధానాలు

‘ల్యాండ్ పూలింగ్’ మంచి విధానం కాదని ‘భూ సేకరణ’ విధానమే మంచిదని సోకాల్డ్ అధినేతలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాయలేకపోయారు. ‘మా కడుపులు కొట్టద్ద’ని కాళ్ళావేళ్ళ పడిన రైతుల రోదనను కనీసం బయట ప్రపంచానికి కూడా తెలియనివ్వని నియంతృత్వ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపితే ‘అమరావతి’ గురించి ఒక్క వ్యతిరేక వార్త కూడా రాకుండా ఆ అధినేతలు చూసుకున్నారు. ‘ల్యాండ్ పూలింగ్’ విధానంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలయిందని విమర్శలు వచ్చినా వీరికి చీమ కూడా కుట్టినట్టు లేదు. పేదల నుంచి భూములను బలవంతంగా తీసుకొని అస్మదీయులకు అప్పనంగా అప్పగించారని ఒక్క వార్త కూడా ఆ మీడియా సంస్థలలో మనం చూసి ఉండం.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి రాజధానులలో పేద ప్రజలు కూడా నివాసం ఉంటున్నారు. ఆయా ప్రాంతాలలో పేద ప్రజలకు ప్రభుత్వాలు పట్టా భూములను దారాదత్తం చేశాయి. అదేమీ విడ్డురమో కానీ ఏపీ ప్రభుత్వం భూముల వితరణ చేయపోతే అమరావతి ప్రాంత వాసులు కోర్టు గడప తొక్కారు. ఈ ప్రాంత భూములను పేద ప్రజలకు పంచేందుకు ఒప్పుకునేది లేదని వారి వాదనగా ఉంది. ఇలాంటి సందర్భంలో అమరావతి ప్రజా రాజధాని కాదు అంటూ ఆ మీడియా సంస్థలకు తెలియదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అసలు వచ్చిన ఇబ్బంది

29 గ్రామలు అందులోనూ మరీ ముఖ్యమంగా 3 గ్రామాలకి చెందిన వారిలో కొందరు స్వప్రయొజనాలకోసం చేస్తున్న రచ్చకు రోజుల తరబడి ఈ మీడియా సంస్థలు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తింటుందనే ఉద్దేశంతోనే ఆ సంస్థలు ఇలా చేస్తున్నాయని మెజారిటీ ప్రజలు గుర్తించినా వారికి పట్టడం లేదు. భూముల సేకరణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లాంటి అవకతవకలు జరిగాయని ప్రభుత్వం వేసిన కమిటీ, ఏసీబీ నిర్దారించిన ఆయా సంస్థలకు మాత్రం పట్టడం లేదు. ఒక వర్గానికే మేలు జరిగేలా భూముల వితరణ జరిగిదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ఆ అధినేతలకు పట్టలేదు…పట్టబోదు. ఎందుకంటే ఆ అధినేతలు ఎవరికి మద్దతుదారులో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న ప్రస్తుత సమయంలో ప్రజల పక్షాన పోరాడుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ఆ సంస్థలు టీడీపీలో మాత్రం అధికార పక్షానికే వత్తాసు పలికాయని రెండు రాష్ట్రాల ప్రజలకు గుర్తు చేయవలసిన అవసరం కూడా లేదు.

ఇప్పటికైనా మారండి సార్లు

అధికారంలో ఉన్నది ఎవరైనా వాస్తవాలను మాత్రం వక్రీకరించడం తప్పని ప్రజలు హితువు పలుకుతున్నారు. మూడు నాలుగు గ్రామల ప్రజల సమస్యలను రాష్ట్ర వ్యాప్త సమస్య అంటూ ఆ సంస్థలు చేసిన హడావిడి చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఇది మాత్రమే గాక ఒకే చోట అభివృద్ధి జరిగితే వచ్చే నష్టమేంతో వారికి తెలియంది కాదు? చెన్నై, హైదరాబాద్ అనుభవాలు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. చెన్నై నుంచి విడిపోయిన తరువాత కర్నూలు ఆ తరువాత హైదరాబాద్ కు వచ్చాం. అన్నీ విధాలుగా నష్టపోయిన మన రాష్ట్రం నిలదొక్కుకునేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. అంత సవ్యంగా సాగుతున్న సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వాసుల పోరాటంతో రాష్ట్రం రెండుగా విడిపోయింది. అభివృద్ధి వికేంద్రికరణ జరగకుండా కేవలం హైదరాబాద్ ప్రాంతంలోనే అభివృద్ధి జరగడంతో ఏపీ చాలా నష్టపోయింది.

జగన్ విజన్ ను చూడండి

గతంలో జరిగిన తప్పునే పునరావృతం చేస్తూ చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. ఇక్కడే అన్నీ సంస్థలను ఏర్పాటు చేసేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలలో అలజడి మొదలయింది. కానీ ఈ విషయాన్ని చంద్రబాబు కానీ ఎల్లో మీడియా సంస్థలు కూడా పట్టించుకోలేదు. 2019లో అధికారంలోకి రాగానే జగన్ ముందుచూపుతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను ఏర్పాటు చేశారు. అమరావతిలో శాసన రాజధానిని కొనసాగిస్తూ వైజాగ్ లో క్యాపిటల్, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. మంచి స్ఫూర్తితో జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కూడా కొందరు కోర్టులకు వెళ్లడం అక్కడ స్టేలు రావడం జరిగిపోయాయి.

రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తింటుందని కొందరు ధనికులు చేస్తున్న రచ్చకు రోజుల తరబడి ప్రచారం కల్పిస్తున్న ఆ మీడియా అధినేతలు ఇప్పటికైనా వాస్తవాలను తెలియచేస్తూ కథనాలు ప్రచురించాలని రాష్ట్ర ప్రజలు హితువు పలుకుతున్నారు.