iDreamPost
iDreamPost
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్ప తప్పుకోవడమో.. తప్పించడమో ఖాయమని ప్రచారం జరుగుతున్న తరుణంలో స్వయంగా ఆయనే కొత్త డెడ్ లైన్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న పార్టీ అధిష్టానం ఆదేశిస్తుందని.. 26న తాను కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించడం విశేషం. దాంతో అధిష్టానం ఏం ఆదేశిస్తుందో.. ఈయన ఏం కార్యాచరణ ప్రకటిస్తారోనన్న ఆసక్తి, ఉత్కంఠ రాష్ట్ర బీజేపీ వర్గాల్లో నెలకొన్నాయి.
శాసనసభాపక్ష సమావేశం రద్దు
ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో ప్రధాని మోదీతో సహా పార్టీ అగ్రనేతలతో మంతనాలు జరిపి తిరిగి బెంగళూరు చేరుకున్నప్పటి నుంచి యడ్యూరప్ప తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారన్న సంకేతాలను ఇచ్చాయి. పార్టీ నేతలను కాకుండా కొడుకు విజయేంద్రను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లిన యడ్డీ తన రాజీనామాకు సమయం ఆసన్నమైందని గ్రహించి తనయుడికి పదవి ఇప్పించుకునేందుకు మంతనాలు జరిపారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇక ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సన్నిహిత మంత్రులు, ఎమ్మెల్యేలకు విందు ఇచ్చి మంతనాలు జరిపారు. అలాగే 23న సొంత ప్రాంతమైన శివమొగ్గలోనూ, 25న ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అయిన సందర్బంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లకు భారీ విందు సమావేశం తలపెట్టారు. 26న పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలోనే యడ్డీ రాజీనామా నిర్ణయం ప్రకటిస్తారని అందరూ భావించారు.
Also Read : అమాత్యుడి తల్లిదండ్రుల ఆదర్శం.. కొడుకు కేంద్రమంత్రి అయినా కూలి పనులతోనే జీవనం
అయితే హఠాత్తుగా ఈ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. శాసనసభాపక్ష సమావేశాన్ని రద్దు చేశారు. 25నాటి విందును భారీగా కాకుండా సాదాసీదాగా నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఈ మార్పులు జరిగాయన్న వాదన వినిపిస్తున్నా.. దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఈ నెల 25న అధిష్టానమే తన నిర్ణయం ప్రకటిస్తుందని స్వయంగా యడ్యూరప్ప ప్రకటించడం పలు వాదనలకు తావిస్తోంది. పార్టీ ఏం చెబుతుంది.. దానిపై యడ్యూరప్ప ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. అయితే నిబద్ధత కలిగిన కార్యకర్తగా పార్టీ ఏది చెబితే అది చేస్తానని.. వచ్చే ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యమని యడ్యూరప్ప చెప్పడం చూస్తే.. ఆయన పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో లేరని అర్థమవుతోంది.
లింగాయత్ ల పట్టు
బీజేపీ అంతర్గత రాజకీయాలను పక్కన పెడితే రాష్ట్రంలోని మఠాల అధిపతులు, యడ్యూరప్ప సొంత సామాజిక వర్గీయులైన వీరశైవ లింగాయత్ ప్రముఖులు పార్టీలకు అతీతంగా యడ్డీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన్ను పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలిసిన వెంటనే సుమారు 30 మఠాల అధిపతులు బెంగుళూరుకు తరలివచ్చి ఏకంగా సీఎం అధికార నివాసంలోనే యడ్డీతో మంతనాలు జరిపారు. ఆయన్ను పదవిలో కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా కొత్తూరు వీరశైవ శివయోగ పీఠాధిపతి సంగన బసవస్వామి హోసూరులో మీడియాతో మాట్లాడుతూ యడ్యూరప్పను తొలగించేందుకు ఆరెస్సెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆయన స్థానంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. యడ్డీని తొలగిస్తే రాష్ట్రంలో బీజేపీ పతనం అవుతుందని హెచ్చరించారు. కాంగ్రెసుకు చెందిన సీనియర్ నేతలు బి.ఎం.పాటిల్, శ్యామనురు శివశంకరప్ప వంటి లింగాయత్ ప్రముఖులు పార్టీలకు అతీతంగా యడ్యూరప్పకు అండగా నిలుస్తున్నారు.
Also Read : మఠాధిపతులు యడ్యూరప్ప పదవిని నిలపగలరా ?