iDreamPost
android-app
ios-app

వైసీపీ స‌మ‌ష్టిగా స‌మ‌ర శంఖారావం

వైసీపీ స‌మ‌ష్టిగా స‌మ‌ర శంఖారావం

తిరుప‌తి ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచే అన్ని పార్టీల దారులూ అటువైపు సాగుతున్నాయి. పార్టీల అధినేత‌లు, ముఖ్యులు జోరుగా మంత‌నాలు సాగిస్తున్నారు. బీజేపీ కూడా అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభను అధికారికంగా ప్ర‌క‌టించేసింది. టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మి ఇప్ప‌టికే నామినేష‌న్ దాఖ‌లు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ గురుమూర్తి ఈ నెల 29న నామినేషన్‌ దాఖలు చేస్తారని పార్టీ చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇప్ప‌టికే ప్రకటించారు. గెలుపు ధీమా ఉన్న‌ప్ప‌టికీ అత్య‌ధిక మెజారిటీ సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఎన్నిక‌ల శంఖారావం పూరించింది. పార్టీ అభ్య‌ర్థి స‌హా ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు జోరుగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టికే ల‌బ్ది పొంది ఉన్న చాలా మంది ఆ పార్టీ అభ్య‌ర్థికి హార‌తులు ప‌డుతున్నారు. చిరున‌వ్వుతో సాద‌రంగా ఆహ్వానిస్తున్నారు.

శ్రీ‌వారి పాదాల చెంత నుంచి స‌మ‌ర శంఖం పూరించిన గురుమూర్తి ప్ర‌చారంలో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. నీతి, నిజాయితీ గ‌ల వ్య‌క్తిగా, వైద్యుడిగా ప్ర‌జ‌ల్లో అనుకూల భావం ఉన్న గురుమూర్తికి ఆద‌ర‌ణ బాగానే ల‌భిస్తోంది. ఆయ‌న మ‌ద్ద‌తుగా వైసీపీ జిల్లా ప‌రిశీల‌కుడు వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వార‌కానాథ‌రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్, ఆదిమూలం వంటి నేత‌లు కూడా ప్ర‌చార వ్యూహాలు ర‌చిస్తున్నారు. పార్టీ శ్రేణులు అంద‌రికీ గురుమూర్తిని ప‌రిచ‌యం చేశారు. ఎమ్మెల్యేలు అయితే గురుమూర్తి వెంట ఉండి స్వ‌యంగా ప్ర‌జ‌ల‌ను క‌లిసి ఓట్ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. పంచాయితీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాల‌తో జోష్ మీదున్న వైసీపీ శ్రేణులు కూడా ఉత్సాహంగా క‌దం తొక్కుతున్నారు.

సామాన్య ద‌ళితుడైన గురుమూర్తిని సీఎం జ‌గ‌న్ ఎంపీ అభ్య‌ర్థిగా ఎంపిక చేసిన‌ప్పుడే విప‌క్షాల‌కు షాక్ త‌గిలింది. ఇప్పుడు ప్ర‌చారంలో దూసుకెళ్తున్న తీరుతో అయోమ‌యంలో ప‌డ్డారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లుగా నియ‌మితులైన 7గురు మంత్రులూ రంగంలోకి దిగారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, గౌతంరెడ్డిలలో త‌మ స‌మయానికి అనుకూలంగా ఒక్కొక్క‌రు తాము బాధ్య‌త వ‌హించే నియోజ‌క‌వ‌ర్గాల‌కు చేరుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. తిరుప‌తి న‌గ‌రంలో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి విస్తృతంగా తిరుగుతున్నారు.

మ‌రోవైపు అభ్య‌ర్థి గురుమూర్తి కూడా ఇప్ప‌టికే తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తి అవ‌గాహ‌నకు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది. స్థానికంగా వైసీపీ చేసిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో స‌ఫ‌లం చెందుతున్నారు. అలాగే తిరుప‌తి రైల్వేస్టేష‌న్‌, ఎయిర్‌పోర్ట్, స్మార్ట్ సిటీ అభివృద్ధి, కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందేలా పాల‌న సాగిస్తాన‌ని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. సీఎం జ‌గ‌న్ ప్రోత్సాహంతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, ప్ర‌జ‌లు ఆద‌రించాల‌ని కోరుతున్నారు. పార్ల‌మెంట్ ప‌రిధిలోని స‌మ‌స్య‌ల‌పై పూర్తి అవ‌గాహ‌న పొందాన‌ని, గెలిపించే లోక్ స‌భ కు పంపిస్తే గ‌ళం వినిపిస్తానంటూ ప్ర‌చారంలో ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకుంటున్నారు. ఇలా మొత్తం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేత‌లు, శ్రేణులు క‌లిసిక‌ట్టుగా లోక్ స‌భ ఉప స‌మ‌రంలో ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు.