ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ ఉదయం నుంచి వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ సింహభాగం స్థానాలను కైవసం చేసుకుంటుంది. టిడిపి ఎన్నికలకు ముందే కాడె దించేసింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో రాజకీయంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నా లోలోపల మాత్రం గ్రామ స్థాయిలో ఎవరూ తమ అధినేత ఆదేశాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారికంగా మేమే ఎన్నికలను బహిష్కరించామని చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం ఎన్నికల కోసం షరా మామూలుగానే పని చేశారు.
అయితే ఇప్పుడు ప్రతిపక్ష నేత, తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు సొంత ఇలాకాలో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో నారావారిపల్లె అంటే నారా చంద్రబాబునాయుడు స్వగ్రామంలో ఊహించని షాక్ తగిలింది. నారావారిపల్లె ఎంపిటిసి స్థానం వైసీపీ కైవసం చేసుకుంది, చంద్రబాబు ఆశీస్సులతో బరిలోకి దిగిన టిడిపి ఎంపిటిసి అభ్యర్థి గంగాధరం ఘోర పరాజయం పాలయ్యారు. వైసీపీ అభ్యర్థిగా రాజయ్య 1347 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా గంగాధరానికి కేవలం 300 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
మరోపక్క చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుపొందిన కుప్పం నియోజకవర్గంలో కూడా వైసిపి సత్తా చాటుతోంది. ఆ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో వైసీపీ 17 స్థానాలు గెలుపొందగా టిడిపి కేవలం రెండు స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. ఏప్రిల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం టీడీపీ ఘోర పరాజయం పాలవ్వాల్సి వచ్చింది. నాలుగు మండలాల్లో సుమారు 89 పంచాయతీలలో 75 స్థానాల్లో వైసీపీ గెలవగా 14 చోట మాత్రమే టీడీపీ జెండా ఎగర వేయగలిగింది. అయితే ఇప్పుడు గతంలో పంచాయతీ ఎన్నికల సమయంలో మంత్రి కొడాలి నానిని తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు టార్గెట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read : ఎన్నికలు – బహిష్కరణ- బాబు గారి కొత్త సూత్రీకరణ
ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొడాలి నాని స్వగ్రామం పామర్రు నియోజకవర్గం పరిధిలోని యలమర్రు అనే గ్రామం. ఆయన తాత హయాంలోనే గుడివాడకు మకాం మార్చి గుడివాడలోని పలు వ్యాపారాలు చేస్తూ వచ్చింది ఆ కుటుంబం. అప్పుడప్పుడు చుట్టం చూపుగా తమ తాత స్వగ్రామానికి వెళ్లే ఆయనని స్వగ్రామంలో కూడా పంచాయతీ గెలుచుకో లేకపోయారు టార్గెట్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఈ విషయం మీద వెంటనే స్పందించిన కొడాలి నాని తన తండ్రి హయాం నుంచి మాది గుడివాడే అని, నా ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నానని, అది తన తాత స్వగ్రామం కాబట్టి అప్పుడప్పుడూ వెళ్లి వస్తుంటా తప్ప ఆ గ్రామ రాజకీయాల్లో ఎప్పుడూ తలదూర్చి లేదని చెప్పారు. స్వయంగా గ్రామంలో సర్పంచ్ గా ఎన్నికైన మహిళ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొడాలి నాని స్వగ్రామం అయి ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడూ గ్రామ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిన దాఖలాలు లేవు అని చెప్పుకొచ్చారు.
ఒక రకంగా చూసుకుంటే మంత్రి కొడాలి నాని వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. కానీ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అంటూ ఉండే ఆయన తాను ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో అలాగే పుట్టిపెరిగి, బంధువులు అందరూ ఉన్న స్వగ్రామంలో పార్టీని గెలిపించుకోలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు కొడాలి నానిని టార్గెట్ చేసిన వారు ఇప్పుడేమంటారో? మరి. ఇక మరో విషయం ఏంటంటే నారా లోకేష్ తన తాత అయిన ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు దత్తత తీసుకోగా ఇప్పుడు నిమ్మకూరులో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం కొసమెరుపు. గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తమ తల్లి స్వగ్రామమైన కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకోగా అక్కడ కూడా వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపొందడం గమనార్హం.
Also Read : కుప్పం కోట మీద వైసీపీ జండా ఎగరేసిన హాసిని