కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొనగా మొత్తం 31 వార్డులకు గాను 13 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే 18 వార్డులలో వైసీపీ విజయం సాధించింది. ఇక్కడ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొత్తం 31 స్థానాలు ఉండగా.. తొలి రౌండ్‌లో 16 వార్డులకు ఓట్ల లెక్కింపు జరిగింది. అందులో టీడీపీ-8, వైసీపీ-8 చోట్ల గెలుపొందాయి. అయితే కొన్ని స్థానాల్లో ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు తక్కువ ఓట్లతో గెలుపొందిన స్థానాల్లో రీ కౌంటింగ్ కోసం పట్టు బట్టారు. ఈ వ్యవహారమే ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే రీ కౌంటింగ్ సమయంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
నిజానికి జగ్గయ్యపేట పట్టణంలోని తొర్రగుంటపాలెం, ఆటోనగర్‌ల విలీనం తర్వాత కోర్టు అవాంతరాలు సమసిపోవటంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అలా విలీనం తర్వాత పురపాలక సంఘంలో వార్డుల సంఖ్య 31కి చేరింది. టీడీపీ, వైసీపీల మధ్యనే ముఖాముఖి పోటీ జరిగింది. అలాగే 2000 సంవత్సరం తర్వాత చైర్మన్‌గా బీసీలకు మళ్లీ చాన్స్ దక్కింది. నిజానికి పురపాలక సంఘం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి మినహా అన్ని సార్లు కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. ఒక్కసారి వైసీపీ విజయం సాధించింది.
Also Read : Kuppam Municipality Results – చంద్రబాబు కంచుకోటను బద్ధలుకొట్టిన వైసీపీ
1987లో పురపాలక సంఘంగా ఏర్పడ్డాక తొలి చైర్మన్‌గా కాంగ్రెస్ తరఫున శ్రీరాం బదరీనారాయణ, 1995లో మహిళలకు రిజర్వ్ కాగా కాంగ్రెస్ నుంచి హనుమంతు రత్నకుమారి ఎన్నికయ్యారు. 2000లో బీసీలకు రిజర్వ్ కాగా కాంగ్రెస్ తరఫున కొమ్మవరపు వెంకటనారాయణ, 2005లో కాంగ్రెస్ తరఫున శ్రీరాం తాతయ్య విజయం సాధించారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించగా ఆయన వర్గం కౌన్సిలర్లు 14 మంది టీడీపీలో చేరడంతో తర్వాత టీడీపీ తరఫున తాతయ్య బాబాయ్ శ్రీరాం సుబ్బారావు చైర్మన్ అయ్యారు. అలా ఒకేసారి పరోక్ష పద్ధతిలో టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014లో వైసీపీ విజయం సాధించగా తన్నీరు నాగేశ్వరరావు, ఇంటూరి రాజగోపాల్‌లు చైర్మన్లుగా పని చేశారు. టీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరాం తాతయ్యలకు అలాగే ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న సామినేని ఉదయభానుకు సొంత పట్టణం కావడంతో రెండు పార్టీలు హోరాహోరీ పోరాడాయి. చివరికి ఇక్కడ వైసీపీ-18, టీడీపీ-13 సీట్లు సాధించినట్టు అయింది. దీంతో ఇది కూడా వైసీపీ ఖాతాలో పడింది.
Also Read : Kondapalli Municipality – కొండపల్లి కుర్చీ ఎవరికీ, కీలకంగా మారిన ఎక్స్ ఆఫీషియో ఓట్లు