iDreamPost
iDreamPost
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగడంతో ఎవరికి వారే తమకు భారీగా సీట్లు వచ్చాయని చెప్పుకోవడానికి ఆస్కారం దక్కింది. కానీ ప్రస్తుతం అలా కాదు. పార్టీ సింబల్ ఆధారంగా ప్రజల్లో ఉన్న బలాబలాలు తేలిపోతున్నాయి. ఎవరి స్థాయి ఏమిటన్నది స్పష్టమమవుతోంది.
ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన మునిసిపల్ ఫలితాల్లో అధికార వైఎస్సార్సీపీకి సంపూర్ణ ఆధిక్యం దక్కుతోంది. సీఎం సొంత నియోజకవర్గంలోని పులివెందుల, సీనియర్ మంత్రి నియోజకవర్గంలోని పుంగనూరు,పల్నాడులోని మాచర్ల, పిడుగురాళ్ల మునిసిపల్ కౌన్సిళ్లు ఆపార్టీ ఖాతాలో చేరాయి. సంపూర్ణ ఏకగ్రీవాలతో సత్తా చాటిన వైఎస్సార్సీపీ మరికొన్ని చోట్ల కూడా అధికారం కైవసం చేసుకనే దిశలో ఉంది. ఇప్పటికే మరో 8 మునిసిపాలిటీలలో సగం పైగా స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో 12 మునిసిపాలిటీలు ఆపార్టీ ఖాతాలో చేరిపోయాయి. మొత్తం 75 మునిసిపాలిటీలకు గానూ మరో 63 మునిసిపాలిటీల ఫలితాలు మాత్రమే ఈనెల 14 నాటి ఫలితాల్లో వెలువడాల్సి ఉంటుంది.
మునిసిపాలిటీలతో పాటుగా కార్పోరేషన్లలో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవాలయ్యారు. చిత్తూరు మునిసిపల్ కార్పోరేషన్ లో సంపూర్ణ ఆధిక్యం అధికార పార్టీకే దక్కింది. కర్నలు, తిరుపతిలో కూడా మెజార్టీ డివిజన్లు ఆపార్టీకే ఏకగ్రీవం అయ్యాయి. దాంతో 12 మునిసిపల్ కార్పోరేషన్లకు గానూ పావు వంతు నగరాల్లో జగన్ జెండాకు పట్టం కట్టినట్టయ్యింది. మొత్తం వార్డులు, డివిజన్లు కలిపి 578 ఏకగ్రీవాలు కాగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు 570 మంది ఉన్నారు. ఇక టీడీపీ కేవలం 6 , బీజేపీ 1, లెఫ్ట్ 1, ఇండిపెండెంట్ మిగిలిన చోట్ల విజయతీరాలకు చేరారు. దాంతో వైఎస్సార్సీపీకి సగం మునిసిపాలిటీలలో పట్టు సాధించినట్టయ్యింది. మిగిలిన చోట్ల కూడా అధికార పార్టీ ఫ్యాన్ గాలి జోరుగా వీస్తున్నట్టు చెప్పవచ్చు.
వాస్తవానికి 2019 ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసిన జగన్ కి పట్టణ ఓటర్లలో మాత్రం పూర్తి పట్టు దొరకలేదు. విశాఖ, రాజమండ్రి వంటి నగరాల్లో టీడీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో కూడా టీడీపీ ఉనికి చాటుకుంది. కానీ ఈసారి దానికి భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. టీడీపీ పట్టుజారి గల్లంతయినట్టే కనిపిస్తోంది. పల్లెలతో పాటుగా పట్టణాల్లో కూడా టీడీపీ పునాదులు చెల్లాచెదురయినట్టు చెప్పవచ్చు. అదే సమయంలో జగన్ కి తిరుగులేని మెజార్టీ దక్కుతోంది. బీజేపీ ఎంతగా ప్రచారం చేసుకున్నా ఆపార్టీకి 1 శాతం బలం కూడా నిలుస్తుందనే ధీమా కనిపించడం లేదు. జనసేన ఏకగ్రీవాల్లో సున్నాగా మిగిలింది. ఆపార్టీకి కూడా పెద్దగా చోటు లేదని తేలిపోతోంది. ఇక మిగిలిన లెఫ్ట్, కాంగ్రెస్ పక్షాల ప్రభావం కూడా నామమాత్రమే. దాంతో అధికార పార్టీ మరోసారి పూర్తిస్థాయిలో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఏకగ్రీవాల్లో తిరుగులేని ఆధిక్యత దగ్గడం, అనేక మునిసిపాలిటీలు ఇప్పటికే తమ చేతుల్లోకి రావడంతో పోలింగ్ జరగాల్సిన చోట్ల కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంది. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా పూర్తిగా పట్టు సాధించే దిశలో సాగుతున్న తీరు స్పష్టమవుతోంది. ఈసారి ఫలితాలు పార్టీ వారీగా ప్రకటించబోతున్న తరుణంలో ఇతర పక్షాలకు ఇవి మింగుడుపడే అవకాశం కనిపించడం లేదు. ఉనికిని చాటుకోవడానికైనా టీడీపీ కొద్ది సంఖ్యలో మునిసిపాలిటీలను దక్కించుకుంటుందా లేదా అన్నదే ప్రస్తుతానికి ప్రశ్నార్థకం.