iDreamPost
android-app
ios-app

పోలింగ్‌కు ముందే వైసీపీ గెలిచిన మున్సిపాలిటీలు

పోలింగ్‌కు ముందే వైసీపీ గెలిచిన మున్సిపాలిటీలు

ఎన్నికలు ఏవైనా అధికార వైసీపీ హవా వీస్తోంది. పోలింగ్‌కు ముందే అధికార పార్టీ ఖాతాలో విజయాలు నమోదవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 16 శాతం సర్పంచ్‌ స్థానాలను ఏకగ్రీవంగా వైసీపీ మద్ధతుదారులు గెలుపొందగా.. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు వెలువడతున్నాయి.

నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ముగిసింది. తుది అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు రూపొందించే పనిలో ఉన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు అందిన సమాచారం మేరకు వైసీపీ 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌ను పోలింగ్‌కు ముందే కైవసం చేసుకుంది. పలు మున్సిపాలిటీల్లో ఫ్యాన్‌ క్లీన్‌స్వీప్‌ చేయగా, మరికొన్ని మున్సిపాలిటీల్లో పాలకవర్గం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలు పోలింగ్‌కు ముందే వైసీపీ ఖాతాలో పడ్డాయి.

కోర్టు వివాదాలు, ఇతర సమస్యలు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మినహాయించి.. ప్రస్తుతం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికార వైసీపీ చిత్తూరు కార్పొరేషన్‌ను గెలుచుకుంది. ఇక్కడ 50 డివిజన్లు ఉండగా వైసీపీ అభ్యర్థులు 30 వార్డుల్లో గెలుపొందారు. తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గాను 19 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో తొలిసారి నాలుగు మున్సిపాలిటీల్లోని అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పులివెందుల (33), పిడుగురాళ్ల (33), పుంగనూరు(31), మాచర్ల(31) మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ టీడీపీ ఒక్క స్థానంలోనూ పోటీలో లేకపోవడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది.

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను వైసీపీ అభ్యర్థులు 18 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో ఆ మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో పడింది. కర్నూలు జిల్లా డోన్‌లో 32 వార్డులకు గాను 22, ఆత్మకూరులో 24 వార్డులకు గాను 15 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. తూర్పు గోదావరి జిల్లా తుని మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను 15, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటిలో 34వార్డులకు 21, ఎర్రగుంట్లలో 20 వార్డులకు గాను 12 వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీల్లో మెజారిటీ వార్డులు అధికార పార్టీ అభ్యర్థులు గెలుచుకోవడంతో పోలింగ్‌కు ముందే ఆయా పురపాలికల్లో వైసీపీ పాలకవర్గాలు ఏర్పడ్డాయి.