Idream media
Idream media
సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కథ క్లైమాక్స్‌కు చేరినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కొంత కాలంగా పార్టీకి, నేతలకు వ్యతిరేకంగా గళం విప్పుతూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చకు తెరలేపిన రఘురామకృష్ణం రాజుపై వైసీపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలందరూ రేపు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ ఎంపీలు, న్యాయనిపుణులతో ప్రత్యేక విమానంలో రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు స్పీకర్ అపాయింట్‌మెంట్ కూడా ఖరారైందని సమాచారం. మధ్యాహ్నం మూడు గంటలకు స్పీకర్‌ను వైసీపీ ఎంపీలు కలవనున్నారు.
పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న రఘరామకృష్ణం రాజుకు ఇటీవల వైసీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే వాటిపై సమాధానం ఇచ్చే రూపంలో తిరిగి పార్టీపైనే విమర్శలు చేశారు. పార్టీ గుర్తింపు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రఘురామ కృష్ణం రాజు వ్యవహారాన్ని త్వరగా ముగించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేపు స్పీకర్‌తో భేటీ కానున్నట్లు సమాచారం.
కాగా, రఘురామకృష్ణం రాజు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తనకు ప్రాణ హాని ఉందంటూ, రక్షణ కల్పించాలని స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఉన్న సమయంలోనే రఘురామకృష్ణం రాజు బీజేపీపై ఆడియో సాంగ్‌ను, మోదీ, బీజేపీలపై వీడియో సాంగ్‌లను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వీడియో సాంగ్‌లో మోదీతోపాటు, తన ఫొటో కూడా ఉండడం గమనార్హం.