మహారాష్ట్ర జైలులో ఉంటూ తీవ్ర అనారోగ్యానికి, కరోనా వైరస్ బారిన పడిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును కాపాడేందుకు వైసీపీ సీనియర్ నేత, తిరుపతి నేత భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ మేరకు వరవరరావు ప్రాణాలు కాపాడాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయస్సుల, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయ చూపాలని భూమన తన లేఖలో కోరారు.
‘‘53 ఏళ్లుగా అడవులలో ఉంటూ ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవం మంచం పట్టిన వృద్ధుడు సాధించగలడా..? ఈ స్థితిలో ఆయనను ఇంకా నిర్భంధంలో ఉంచడం అవసరమా..? రాజకీయాలతో సంబంధం లేకుండా మానవాళి మంచికై ఎన్నో కార్యక్రమాలు చేసిన మీరు దయతో వరవరరావు విషయంలో ఆలోచించాలి’’ అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఉపరాష్ట్రపతిని కోరారు.
46 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు నేను ఇరవై ఒక్క నెలలు ముషీరాబాద్ జైలులో ఉన్నప్పుడు ఆయన మన సహచరుడ. సహచర్యం భావజాలంలో కాదు కానీ, కటకటాల వెనుక కలసి ఉన్నాము.. అందుకు’’ అంటూ తాను లేఖ రాయడం వెనుక కారణాన్ని పేర్కొన్నారు. అనారోగ్యంతో అడుగులు తడబడుతూ నిస్సహాయంగా ఉన్న ఓ సిద్ధాంతనిబద్ధ వృద్ధుడిని ప్రజా స్వామ్యవాదులైన మీరు సానుభూతితో కాపాడాలని వెంకయ్యనాయుడును కరుణాకర్‌రెడ్డి కోరారు.