iDreamPost
iDreamPost
ఏపీ క్యాబినెట్ విషయంలో జగన్ నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. మంత్రులను సరిదిద్దేందుకు సీఎం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రులు క్రియాశీలకంగా వ్యవహరించేందుకు తగ్గట్టుగా తీసుకున్న మార్పులు మేలు చేసేలా కనిపిస్తున్నాయి. ఇంకా ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన నేతలంతా దూకుడు పెంచారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలోనూ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడంలో తలో మాట వేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి ప్రజల్లో గుర్తింపు తెచ్చే విధంగా జాగ్రత్తలు పాటిస్తే వైసీపీ అధినేత ప్రయత్నాలకు మంచి ఫలితం వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది.
ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా మొన్నటి వరకూ చాలామంది మంత్రుల్లో క్రియాశీలత కనిపించ లేదు. అవగాహన, సామర్థ్యం ఉన్నప్పటికీ సమస్యల పట్ల స్పందించడంలో పలువురు చొరవ చూపకపోవడంతో వైసీపీ వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దాంతో విపక్షాలు ముప్పేట దాడితో సొంత పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త సందేహాలు ఏర్పడే పరిస్థితి వచ్చింది. దాన్ని గ్రహించిన అధినేత పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు. మంత్రులందరికీ క్యాబినెట్ మీటింగ్ లో క్లాస్ పీకారు. సొంత పార్టీ నేతలకు అందుబాటులో ఉండడం, సంబంధిత శాఖ కు సంబంధించిన విషయాల్లో శ్రద్ధ పెట్టడం, ప్రభుత్వ విధానాలపై గట్టిగా వాయిస్ వినిపించడం వంటి అంశాల్లో అందరూ జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
దానికి తగ్గట్టుగా వారానికి రెండు రోజుల పాటు సచివాలయంలో అందుబాటులో ఉండాలనే నిర్ణయాన్ని ఇప్పటికే అనేకమంది పాటిస్తున్నారు. అదే సమయంలో సచివాలయం నుంచి గానీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గానీ మీడియా సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఒకేసారి ఐదారుగురు మంత్రులు గొంతు విప్పడంతో ప్రభుత్వ వాయిస్ పెరగడానికి దోహదపడుతోంది. గతంలో కన్నబాబు, కొడాలి నాని, పేర్ని నాని, బొత్సా, అనిల్ వంటి ఒకరిద్దరు మినహా మిగిలిన వారు పెద్దగా మీడియా సమావేశాలు నిర్వహించడానికి ఆసక్తి చూపకపోవడంతో విపక్షాల వాయిస్ పై చేయిగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ మంత్రి తనదైన శైలిలో విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం కావడం సత్ఫలితాలను ఇస్తోందని పార్టీ భావిస్తోంది.
మంత్రులతో పాటుగా పార్టీ నేతలు కూడా ఈవిషయంలో ఆసక్తి చూపుతుండడం ప్రయోజనం ఇస్తోందని వైసీపీ క్యాడర్ చెబుతోంది. ఇటీవల ఎంపీల పట్ల సుజనా చౌదరి కామెంట్స్ కి కౌంటర్ గా ఏకకాలంలో పలువురు ఎంపీలు ముందుకు రావడంతో సుజనా కామెంట్స్ కి చెక్ పెట్టే పరిస్థితి వచ్చిందని అంంటున్నారు. ఇలాంటి పరిస్థితికి ముందుగా అధినేత చూపుతున్న చొరవే కారణమని వైసీపీ నేతలంతా భావిస్తున్నారు. కొన్ని నెలలుగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా స్పందించని జగన్ , ఇటీవల ఇంగ్లీష్ మీడియం విషయంలో నేరుగా వెంకయ్య, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావించి మరీ ప్రశ్నాస్త్రాలు సంధించడం ద్వారా మిగిలిన వారికి మార్గం చూపుతున్నట్టయ్యిందని అంటున్నారు. ముమ్మిడివరం సభలో కూడా అందరూ కలిసి మంచి చేస్తున్న తనను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ, జనం కోసం వాటిని తట్టుకుంటానని చెప్పడం ద్వారా సానుకూల సంకేతాలు సాధించే దిశలో సీఎం అడుగులు వేసి మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు.
Also Read: మహా”నాటకంలో కీలక పాత్రధారి అజిత్ పవార్
మొత్తంగా వైసీపీ నేతల్లో వచ్చిన ఈ మార్పు ఇటీవల పార్టీకి మేలు చేసే దిశగా సాగుతోందని అంటున్నారు. ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన, వాటికి తోడుగా బీజేపీ విమర్శలు చేస్తుండగా, మీడియా కూడా వంతపాడుతున్న నేపథ్యంలో మంత్రులు బలంగా గొంతు విప్పితే వాటిని విమర్శలకు అడ్డుకట్ట ఖాయమనే వాదన బలపడుతోంది. అదే సమయంలో మంత్రులు భాష విషయంలో జాగ్రత్తలు పాటించడం ఉపయోగం అని, ప్రజల్లో మాట్లాడే సమయంలో పద్దతిగా వ్యవహరించాలనే అభిప్రాయం వినిపిస్తోంది.