iDreamPost
android-app
ios-app

Kuppam elections – కుప్పం కోట‌లో వైసీపీ గెలుపు పక్కా ?

  • Published Nov 14, 2021 | 1:55 AM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
Kuppam elections – కుప్పం కోట‌లో వైసీపీ గెలుపు పక్కా ?

కొత్త‌గా ఏర్ప‌డ్డ కుప్పం మున్సిపాలిటీ వైసీపీ ప‌రం కానుందా? టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కీల‌క ప్రాంతంలో వైసీపీ జెండా ఎగ‌ర‌నుందా? తెలుగుదేశం ఎందుకింత క‌ల‌వ‌ర‌ప‌డుతోంది? బాబు, లోకేష్‌లు కుప్పంపై ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారు? ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మినీ యుద్ధంలో ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మిగిలిన స్థానాలు ఓ లెక్క‌.. కుప్పం మున్సిపాల్టీ ఓ లెక్క‌గా మారింది. ఇక్క‌డి మున్సిపల్‌ పోరు కాక రేపుతోంది.

ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవ‌డానికి అధికార పార్టీ కూడా గ‌ట్టిగానే క‌స‌ర‌త్తు చేస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పాగా వేయాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలోనే మకాం వేసి చ‌క్రం తిప్పుతున్నారు. ప్ర‌చారంలో వైసీపీ శ్రేణుల‌ను ఉరుకులు, ప‌రుగులు పెట్టిస్తున్నారు. కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉండగా, ఇప్ప‌టికే ఓ వార్డు వైసీపీకి ఏక‌గ్రీవ‌మైంది. అన్నింటినీ గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేయాలన్న కసితో వైసీపీ ముందుకెళ్తోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీ.. కనీసం కుప్పం గెలిచి పరువు నిలుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అటు అధికార పక్షానికీ, ఇటు ప్రతిపక్ష టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారడంతో కుప్పం పోరు హీట్ పుట్టిస్తోంది.

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెర‌ప‌డ‌డంతో వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పంపై కుస్తీ పట్టుపట్టాయి టీడీపీ, వైసీపీలు. నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. కుప్పం.. మున్సిపాలిటీగా మారిన తర్వాత ఫస్ట్ టైమ్‌ ఎలక్షన్స్‌ జరుగుతుండటంతో హైవోల్టేజ్ వార్ జరుగుతోంది. కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉండగా, అన్నింటినీ గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేయాలన్న కసితో వైసీపీ ముందుకెళ్తోంది. మంత్రి పెద్దిరెడ్డితోపాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కాగా, ఈనెల 15న పోలింగ్‌ నిర్వహించి, ఈనెల 17న కౌంటింగ్‌ చేపట్టాలన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. నెల్లూరు నగర కార్పొరేషన్ ఇందులో ఒకటి. 54 డివిజన్లలో 8 ఏకగ్రీవం కాగా మిగతా 46 చోట్ల వైసీపీ, టీడీపీతో పాటూ జనసేన, కొన్ని చోట్ల వామపక్షాల అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు.

అన్నింటికంటే భిన్నంగా కుప్పం మున్సిపాలిటీ పోరు సెగలు రేపుతోంది. వైసీపీ జెండా ఎగరేయటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గెలుపు కోసం వైసీపీ గట్టి వ్యూహాలే ర‌చించింది. అభివృద్ధి నినాదంతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు వైసీపీ అభ్య‌ర్థులు. జ‌గ‌న్ బొమ్మ‌తో సంక్షేమ సార‌థికి ప‌ట్టం క‌ట్టాల‌ని కోరుతున్నారు. వైసీపీ ప్ర‌చారానికి టీడీపీ బెంబేలెత్తుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అక్రమాలు జరుగుతున్నాయని వరస పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి లేఖలు రాస్తున్నారు చంద్రబాబు. అధికారపార్టీ అదేస్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తోంది. చంద్రబాబు స్వయంగా కుప్పం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. ఆయన తనయుడు నారా లోకేష్ కూడా అదే పనిలో ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులంతా కుప్పంలోనే మొహరించారు. దీంతో అక్క‌డ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం రంజుగా మారింది. బాబు కోట‌ను బ‌ద్ద‌లు కొడ‌తామ‌ని వైసీపీ నేత‌లు ధీమాగా చెబుతున్నారు. దీంతో ఉత్కంఠ ఏర్ప‌డింది.

Also Read : Mini Municipal Elections – మినీ ప్రచారం ముగిసింది.. ఆ ఒక్క మున్సిపాలిటీపైనే ఆసక్తి