iDreamPost
android-app
ios-app

జగన్ నయా ట్రెండ్

  • Published Jun 24, 2021 | 7:46 AM Updated Updated Jun 24, 2021 | 7:46 AM
జగన్ నయా ట్రెండ్

ఏడాది కిందట ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా రిలీఫ్ కింద 20 లక్షల కోట్లను వివిధ వర్గాలకు సాయంగా ప్రకటించింది. కానీ కేంద్రం ఈ 20 లక్షల కోట్లలో ఎవరికి ఎంత ఇచ్చిందో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు.

ఇదే సమయంలో ఏపీలోని వైఎస్సార్ సీపీ సర్కారు.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజా సంక్షేమం కోసం అక్షరాలా రూ.లక్ష కోట్లను ఖర్చు చేసింది. ఇది ప్రకటనలకే పరిమితమైన ఖర్చు కాదు.. కేవలం బడ్జెట్ లో చూపే లెక్క కాదు.. నేరుగా లబ్ధి దారుల ఖాతాలో చేరిన డబ్బు. కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను ఆదుకున్న డబ్బు. పాలనలో, ప్రజా సంక్షేమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సృష్టించిన నయా ట్రెండ్ ఇది.

ప్రభుత్వం టు ప్రజలు..

గతంలోనూ సంక్షేమ పథకాలు ఉండేవి. ప్రజలకు అంత ఖర్చు చేస్తాం.. ఇంత ఖర్చు చేస్తాం అంటూ బడ్జెట్ ప్రవేశ పెట్టేవి ప్రభుత్వాలు. కానీ ఎవరికి ఏం ఇస్తున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? అనే లెక్కాపత్రం ఉండేది కాదు. కానీ రెండేళ్ల కిందట వైఎస్ జగన్.. ఏపీ సీఎం అయ్యాక సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పాలనను జవాబుదారీ తనంతో నడిపిస్తున్నారు. ఏ పథకానికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఏ లబ్ధి దారుడికి ఎంత ఇస్తున్నారు? అనే లెక్క పక్కాగా ఉంటోంది. దీనిపై శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎవరూ అడగకముందే.. ప్రశ్నించాల్సిన అవసరం రాకముందే వివరాలన్నీ ప్రజల ముందు పెడుతున్నారు. నేరుగా ప్రజలతో కనెక్ట్ అవుతున్నారు. పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేరుస్తున్నారు.

ఇంటింటికీ లబ్ధిదారులు

వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి ఇంటికీ కలుగుతోంది. ప్రతి ఇంటిలోనూ లబ్ధిదారులు ఉన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, మత్స్యకార భరోసా, పెన్షన్, చేయూత, ఆసరా.. ఇలా 25 దాకా పథకాలను అమలు చేస్తున్నారు. ఆరు లక్షల ఉద్యోగాలతో రికార్డు సృష్టించి.. నిరుద్యోగుల బాధలను తీర్చారు. మరో 10 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించి.. గుడ్ న్యూస్ చెప్పారు.

సంక్షోభంలోనూ సంక్షేమం

‘క్లాసులో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు. పరీక్షలో రాసే వాడే టాపర్ అవతాడు’.. ఓ తెలుగు సినిమాలో డైలాగ్ ఇది. అలాంటి టాపరే వైఎస్ జగన్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగున్నపుడు.. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు ఎవరైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. కానీ ఏడాదిన్నరగా కరోనా సంక్షోభ పరిస్థితిలో చిక్కుకున్నాం. ఆర్థిక కార్యకాలాపాలన్నీ ఆగిపోయాయి. ఖర్చు పెరిగిపోతోంది తప్పా.. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడలేదు. సంక్షేమం పరుగులు పెడుతూనే ఉంది.

ఒక్కో పథకానికి వేల కోట్లు..

2019 జూన్ నుంచి 2021 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ లో వివిధ పథకాల కింద ఎంతో మంది లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ జరిగింది. జగనన్న అమ్మ ఒడి కింద రూ.13 వేల కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 4,879 కోట్లు, రైతు భరోసా కింద రూ.17 వేల కోట్లు, పెన్షన్ కానుక కింద 32,469 కోట్లు, చేయూత కింద రూ.9 వేల కోట్లు, ఆసరా కింద రూ.6 వేల కోట్లు, తెల్లకార్డుదారులకు కరోనా సాయం కింద 1,350 కోట్లు.. మొత్తంగా గత రెండేళ్లలో లక్ష కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. ఇంకా వేస్తున్నారు. ఇంత సంక్షేమం జరుగుతున్నా ప్రచారం చేసుకుని ప్రభుత్వం ఇది. తన పని తాను చేసుకుని పోతే ప్రచారం దానంతట అదే వస్తుందని భావించే ప్రభుత్వమిది. ప్రజా ప్రభుత్వమిది.