iDreamPost
android-app
ios-app

Ysrcp mandali – మండలిలో పూర్తి ఆధిక్యం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ 

  • Published Nov 25, 2021 | 1:48 AM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
Ysrcp mandali – మండలిలో పూర్తి ఆధిక్యం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ 

రాష్ట్రంలో శాసనసభలో తిరుగులేని ఆధిక్యత సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలినాళ్ళలో శాసనమండలి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. వాస్తవానికి పెద్దల సభగా పనిచేయాల్సిన శాసనమండలి, అప్పట్లో టీడీపీ రాజకీయ పునరావాసానికి ఈ సభను వాడుకోవడం కారణంగా సభ రాజకీయంగానే పనిచేసిందనే ఆరోపణ ఎదుర్కొంది. టీడీపీ 2014 నుండి 2019 వరకూ అధికారంలో ఉన్నందువల్ల సభలో అప్పట్లో ఆ పార్టీ ఆధిక్యంలోనే  ఉంది. ఈ పరిస్థితిని పూర్తిగా రాజకీయంగా వాడుకున్న  చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని శాసనమండలిలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లుల విషయంలో ఏకంగా చంద్రబాబు నాయుడు శాసనమండలి సందర్శకుల గ్యాలరీలో కూర్చుని అప్పటి మండలి చైర్మన్ షరీఫ్ పై వత్తిడి తెచ్చి అడ్డుకున్నారు. 

పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా, పదకొండేళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సారి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని మండలి చైర్మన్ ను ప్రభావితం చేసి, రాజకీయంగా వత్తిడి పెట్టి మూడురాజధానుల బిల్లు పాస్ కాకుండా అడ్డుకుని ప్రభుత్వాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వాన్ని చిక్కుల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ప్రజలు తిరుగులేని ఆధిక్యం ఇస్తే శాసనమండలిలో ఆధిక్యం ఉందన్న కారణంగా ప్రతిపక్ష టీడీపీ ఇలా రాజకీయంగా అడ్డుకోవడాన్ని సమర్ధించలేని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం ఏకంగా శాసనమండలి రద్దు కోరుతూ తీర్మానం చేసి, దాన్ని ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే యేడాదిన్నర  దాటినా  కేంద్ర ప్రభుత్వం శాసనమండలి రద్దు నిర్ణయంపై ఎలాంటి స్పందన చూపించకపోవడంతో మళ్ళీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మండలి కొనసాగించేందుకు తాజాగా తీర్మానం చేసింది. 

ఈ లోగా శాసనమండలి బలాబలాల్లో నిర్ణయాత్మకమైన మార్పులు వచ్చాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతలోకి వచ్చింది. ప్రతిపక్ష టీడీపీ తన బలాన్ని ఒక్కొక్కటిగా కోల్పోయింది. శాసనసభలో అత్యధిక స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉండడం, ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలోపోటీచేసేందుకు కూడా తగిన సంఖ్యాబలం లేకపోవడంతో మండలిలో టీడీపీ వరుసగా తన బలాన్ని కోల్పోయింది. శాసనసభలో సంఖ్యాబలంతో పాటు అధికారంలో ఉన్నందువల్ల నామినేటెడ్ సభ్యుల నియామకంలో  కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిన అంశం. ఈ రెండు కారణాలతో వైఎస్సార్ కాంగ్రెస్ క్రమంగా తన బలాన్ని పెంచుకోగా, ప్రతిపక్ష టీడీపీ తన బలాన్ని ఒక్కొక్కటిగా కోల్పోయింది. 

ఇప్పుడు తాజాగా స్థానిక సంస్థల నుండి 11 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానుండడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ బలం 32కు పెరిగింది. మరో వైపున ప్రతిపక్ష టీడీపీ బలం 15కు తగ్గింది. స్థానిక సంస్థల నుండి ఎన్నిక అవుతున్న 11 మంది శాసనమండలి సభ్యుల నామినేషన్ పత్రాల పరిశీలన నేటితో ముగియడంతో, ఇప్పటికి 11 చోట్ల అధికార వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులే నామినేషన్ వేసి ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అవుతోంది. ఈ ఎన్నిక పూర్తయితే వైఎస్సార్ కాంగ్రెస్ అటు శాసనసభలోనూ, ఇటు శాసనమండలిలోనూ తిరుగులేని ఆధిక్యం సాధిస్తుంది.

Also Read : Chandrababu- పాలన వదిలి పొలిటికల్‌ స్టంట్లు చేయాలంటారా బాబూ..?