ఏడవటం నాయకత్వ లక్షణం కాదు.. ఏడ్చేవాడు నాయకుడే కాదు. ఏడ్చే మగాడిని నమ్మకూడదు.. అని మన పెద్దలు అంటుంటారు. కానీ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలోనూ.. బయట ప్రెస్మీట్లోనూ కన్నీటి వరద పారించారు. ఏడ్చుటయే ఎరుగానివాడు.. అంటూ టీడీపీ నేతలు ఆయన ఏడ్పులకు కొత్త భాష్యాలు చెప్పారు. దాన్ని సానుభూతిగా మలచుకునేందుకు ఇప్పటికీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే అనేకమంది చంద్రబాబు ఏడ్పుల ఎపిసోడ్ పై వేరే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. రాజకీయ చాణక్యుడినని గొప్పలు చెప్పుకునే నేత ఏడవటం అసహ్యంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చంద్రబాబు ఎపిసోడ్ పై కాస్త ఘాటుగానే స్పందించారు.ఏడుపు ఆయుధం కాదని.. అదో బలహీనత అని ఆయన వ్యాఖ్యానించారు. ఏడ్చే వాడు అసలు నాయకుడే కాదన్నారు. ఏడ్పు నుంచి సానుభూతి వెతుక్కోవడం చూస్తుంటే అసహ్యమేస్తోందని అన్నారు.
ఎవరేమన్నారని ఏడుపు లంకించుకున్నారు?
అసలు చంద్రబాబు అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు తనను ఏవేవో అన్నారని ఆరోపిస్తూ ఏడుపు లంకించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అతన్ని గానీ.. అతని కుటుంబాన్ని ఉద్దేశించి గానీ ఎవరూ ఏమీ అనలేదని ఆనాటి అసెంబ్లీ ఫుటేజ్ చూస్తే స్పష్టం అవుతోంది. కానీ అన్నారంటూ ఏడవడం ఎందుకో ఆయనకే తెలియాలన్నారు. ప్రజా సమస్యలపైనా, వ్యక్తిగతంగా అన్యాయం జరిగినా.. ఎదురు నిలిచి పోరాడాలే తప్ప ఏడవటం.. అసెంబ్లీ సమావేశాలకు రానని ప్రకటించడం భీరువుల లక్షణమని యార్లగడ్డ అభివర్ణించారు.
25 ఏళ్ల క్రితం ఏం చేశారో గుర్తులేదా?
ఇప్పుడు తనకేదో జరిగిపోయిందని వగచి వగచి ఏడ్చిన చంద్రబాబు 25 ఏళ్ల క్రితం అదే అసెంబ్లీలో సొంత మామ ఎన్టీఆర్ కు చేసిన అన్యాయాన్ని, అవమానాన్ని మరచిపోయారా అని యార్లగడ్డ ప్రశ్నించారు. అధికారాన్ని, టీడీపీ పార్టీని లాక్కున్న చంద్రబాబు నిండు సభలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అవమానించారని గుర్తుచేశారు. ఆనాడు స్పీకరుగా ఉన్న యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ మాట్లాడతానన్నా మైక్ ఇవ్వలేదని.. దాంతో అవమాన భారంతో పెద్దాయన కన్నీటి పర్యంతమయ్యారని చెప్పారు. కాగా ప్రస్తుతం టీడీపీ ఏపీలోని 13 జిల్లాలకు పరిమితం అయిన పార్టీ అని.. ఇక్కడ కూడా పతనావస్థలో ఉందన్నారు. అటువంటప్పుడు చంద్రబాబు, లోకేష్ లకు జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న హోదాలు ఎందుకని యార్లగడ్డ ప్రశ్నించారు.
Also Read : Chandrababu- చివరి అస్త్రాన్ని ప్రయోగించడం మొదలు పెట్టిన చంద్రబాబు