iDreamPost
android-app
ios-app

యనమల సెజ్ రాజకీయాలు ఎవరికీ తెలియనివి

  • Published Oct 02, 2020 | 3:10 AM Updated Updated Oct 02, 2020 | 3:10 AM
యనమల సెజ్ రాజకీయాలు ఎవరికీ తెలియనివి

గురివింద రాజకీయాలకు టీడీపీ నేతలు పెట్టింది పేరు. అందులో యనమల రామకృష్ణుడిది అందెవేసిన చేయి అని అందరికీ తెలుసు. అందుకే ఆయన మాటల్లో ప్రస్ఫుటించే నీతి ఆచరణలో ఉండదని స్వగ్రామ ప్రజలకు బాగా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా జనాలకు అర్థమయ్యింది. అయినప్పటికీ ఆయన తీరు మారదు. పైగా మరింతగా నీతులు వల్లిస్తూ, గోతులు తవ్వే పనులకు వెనకాడరని సొంత పార్టీ నేతల్లోనే చర్చలు సాగుతూ ఉంటాయి.

తాజాగా ఆయన కాకినాడ సెజ్ లో యాజమాన్య మార్పిడి గురించి విమర్శలు చేశారు. జగన్ బినామీలతో అక్కడి భూములు కాజేస్తున్నారని విమర్శించారు. 5వేల కోట్ల విలువైన 10వేల ఎకరాల సెజ్ భూములును అరబిందో రూపంలో జగన్, విజయసాయిరెడ్డి దక్కించుకున్నారని ఆరోపించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం జగన్ కి విజయసాయిరెడ్డి బినామీ, విజయసాయిరెడ్డి అరబిందో బినామీ. కాబట్టి అరబిందో వ్యాపారాలు, వ్యవహారాలు జగన్ కనుసన్నల్లోనే సాగుతున్నాయన్నది యనమల వాదన. యనమల ఏది చెప్పినా గట్టిగా వినిపించడానికి ఓ సెక్షన్ మీడియా ఉందనే ధీమాతో నోటికొచ్చింది చెప్పడమే గానీ వాస్తవానికి అరబిందో సంస్థ ఏర్పడి నేటికీ 34 ఏళ్లు. అంటే జగన్ పుట్టిన 14వ ఏటనే అరబిందో ఏర్పడితే అది ఇప్పుడు జగన్ కి బినామీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వింతగాక ఏమవుతుంది. ఎప్పుడో ప్రారంభించిన ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన సంస్థ ఇప్పుడు జగన్ సీఎం కాగానే బినామీ సంస్థ అయిపోతుందని టీడీపీ నేతలు చెబుతున్న సూత్రం విస్మయకరం కూడా.

కాకినాడ సెజ్ వాస్తవానికి చంద్రబాబు పుణ్యమేనని అందరికీ తెలుసు. 2003లోనే దానిని ప్రతిపాదించిన ఘనత చంద్రబాబు, యనమలకు దక్కుతుంది. తన స్వగ్రామం అయిన తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఏవీ నగరాన్ని ఆనుకుని సెస్ ప్రతిపాదించారు. తొండంగి, యూ కొత్తపల్లి మండలాల్లో సుమారు 10వేల ఎకరాల భూమిని వైఎస్సార్ హయంలో సేకరించారు. అప్పట్లో భూసేకరణ విషయంలో రైతులకు నష్టపరిహారం చెల్లించే విధానంలో భూ యజమానుల కోరిక మేరకు పెంచి ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది. దానిని కూడా టీడీపీ పోరాట ఫలితమని చెప్పుకోవడానికి యనమల సిద్దమయ్యారంటే ఆయన ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

అదే సమయంలో చంద్రబాబు ఐదేళ్ల కాలంలో సెజ్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. భూములన్నీ ఖాళీగా ఉన్నా ఎటువంటి చర్చలకు పూనుకోలేదు. పైగా ఖాళీ భూములు వదిలేసి మరో 500 ఎకరాలు సేకరించి దివీస్ పరిశ్రమ పెట్టడానికి పూనుకున్నారు. అప్పట్లో యనమల సొంత మండలంలోనే సుదీర్ఘ ఉద్యమం జరగడం, వైఎస్ జగన్ స్వయంగా అక్కడికి వెళ్లి బాధితులకు భరోసా ఇవ్వడంతో దివీస్ పరిశ్రమ ఆగిపోయింది. ఇక ఇప్పుడు కాకినాడ సమీపంలో బల్క్ డ్రగ్ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. పలు రాష్ట్రాలతో పోటీ పడి దానిని సాధించాలనే తపనతో ఉంది. అలాంటి సమయంలో బల్క్ డ్రగ్ యూనిట్ వస్తే ఖాళీ భూముల్లో పరిశ్రమలకు అవకాశం ఉంటుందనే విషయాన్ని వక్రీకరించి అసలు పరిశ్రమలు రాకూడదని యనమల వాదించడం మరో చర్చనీయాంశం. 15 ఏళ్లుగా భూమలున్నీ ఖాళీగా ఉన్న చోట మరికొన్నాళ్లు అలానే ఉండాలని యనమల ఆశిస్తున్నారా.. కొత్తగా పరిశ్రమలు వస్తే రాకూడదని చెప్పడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనం.

తమ చేతగానితనం వల్ల భూములు పడావుగా మిగిలిపోయిన విషయాన్ని విస్మరించి జగన్ పై బురదజల్లేందుకు, కొత్త పరిశ్రమలు రాకుండా చేసేందుకు పూనుకోవడం ఆందోళనకరం. వాస్తవానికి జీఎంఆర్ సంస్థ తన వాటా 51 శాతాన్ని ఇటీవల అరబిందో రియాల్టీ సంస్థకు అమ్మకం పెట్టింది. ఆ మేరకు ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అరబిందో ఆధ్వర్యంలో కాకినాడ సెజ్ అభివృద్ధి జరగడానికి అవకాశాలు మెరుగవుతున్న తరుణంలో టీడీపీ నేతలు సహించలేని తనం చాటుకుంటున్నారా అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓవైపు పరిశ్రమలు రావడం లేదని దానికి జగన్ కారణమని వాదిస్తూ, మరోవైపు కొత్త పరిశ్రమలు వస్తున్నాయి..దానికి జగన్ బినామీ అంటూ నిందించడం టీడీపీకి, అందులోనూ యనమల వంటి వారికే చెల్లిందని చెప్పవచ్చు.