iDreamPost
android-app
ios-app

దివీస్ చుట్టూ యనమల మార్క్ దివాళా రాజకీయాలు

  • Published Dec 12, 2020 | 3:30 PM Updated Updated Dec 12, 2020 | 3:30 PM
దివీస్ చుట్టూ యనమల మార్క్ దివాళా రాజకీయాలు

దివీస్ ఫార్మా.. మురళీ దివి కి చెందిన కంపెనీల విస్తరణకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో దక్కిన ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. అందుకు అనుగుణంగా కాకినాడ సెజ్ కి సంబంధించిన భూములను వెనక్కి తీసుకుని మరీ దివీస్ కి కేటాయించిన అనుభవం చంద్రబాబుది. 2015లోనే ఈ ప్రక్రియ జరిగింది. అప్పట్లో సీఎం గా చంద్రబాబు ఉండగా, యనమల రామకృష్ణుడుకి ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు.

దానికి ప్రధాన కారణం ప్రతిపాదిత దివీస్ ఫార్మా కంపెనీ స్వయంగా యనమల స్వగ్రామం ఏవీ నగరం పరిసరాలను అనుకుని ఉండడం విశేషం. పైగా దివీస్ నిర్మాణం చేపట్టిన కొత్తపాకలు, పంపాదిపేట వంటి గ్రామాల నిండి యనమల సామాజికవర్గీయులు, బంధువులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఒకనాడు యనమల రాజకీయ భవిష్యత్ కోసం పునాదులుగా వాడుకున్న తమను పావులుగా చేసుకుని , మా ప్రాణాలతో ఆడుకోవడానికి సిద్ధమవుతావా అంటూ వారు నేరుగా యనమలనే నిలదీసిన అనుభవాలున్నాయి.

2016,17 సంవత్సరాలలో కాకినాడ సమీపంలోని యనమల సొంతమండలం తొండంగిలో ఈ కంపెనీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆ తర్వాత దివీస్ కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం సాగింది. దాదాపుగా ఉద్యమం జరిగినన్ని రోజులు యనమల తన సొంత గ్రామానికి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ఆయన విజయవాడకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడూ మాత్రమే కాకినాడలోని తన గెస్ట్ హౌస్ కి వెళ్లి రావడమే తప్ప ఏవీ నగరం వైపు వెళ్లడానికి కూడా ఆయన వెనకాడారు. అంత ఉధృతంగా ఆరోజుల్లో ఉద్యమం సాగిన సమయంలో పోలీసులను ఉపయోగించి తన సొంత మనుషుల మీద కూడా విచక్షణారహితంగా వ్యవహరించిన అనుభవం ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. పైగా యనమల సోదరుడు యనమల కృష్ణుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించి, తప్పుడు కేసులతో దివీస్ బాధితులను వేధిస్తే అప్పట్లో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బాధితుల పక్షాన నిలిచారు. అన్ని రకాలుగానూ అండగా నిలబడిన వైఎస్సార్సీపీకి ఆ తర్వాత యనమల మనుషులు కూడా జైకొట్టడంతో యనమల సొంత మండలంలో ఆపార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇదంతా జరిగి రెండు మూడేళ్లు కూడా గడవకముందే ప్రస్తుతం యనమల దివాళా రాజకీయాలకు తెరలేపారు. దివీస్ ని తాము వ్యతిరేకించినట్టు, తమ వల్లే ఆ పరిశ్రమ ఆగినట్టు , ఇప్పుడు ప్రభుత్వం దానికి అనుమతులు ఇచ్చినట్టు అబద్ధాలను ప్రచారం చేసే బాధ్యతను టీడీపీ భుజాన వేసుకుంది. వాస్తవానికి కాకినాడ సెజ్ కి కేటాయించిన భూములను కూడా వెనక్కితీసుకుని ఏపీఐఐసీ ద్వారా 2015లో 550 ఎకరాల భూమి కేటాయించినట్టు ఆధారాలున్నప్పటికీ యనమల కూడా వాటిని విస్మరించి ప్రకటనలు చేస్తుండడం విశేషం. అంతేగాకుండా ప్రస్తుతం జగన్ ప్రభుత్వం కోన ప్రాంత పర్యావరణ పరిరక్షణ కోసం కేవలం 250 ఎకరాలకే దివీస్ ప్లాంట్ ని పరిమితంచేస్తూ నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా యనమల పక్కదారి పట్టించే పనికి పూనుకుంటున్నారు. అప్పట్లో హేచరీలు నాశనమయినా, దివీస్ నిర్మాణం జరిగితే చాలన్నట్టుగా వ్యవహరించిన యనమల ఇప్పుడు హేచరీలను కాపాడాలని ప్రకటనలు చేయడం విడ్డూరమనే వ్యాఖ్యలు దివీస్ బాధితుల్లో వినిపిస్తోంది.

అధికారంలో ఉన్నప్పుడు తమ మీద పోలీస్ జులుం ప్రదర్శించి, ఇప్పుడు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని తొండంగి మండల ప్రజలు యనమల బ్రదర్స్ ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. దివీస్ నుంచి పెద్ద మొత్తంలో ప్రయోజనం పొంది, ప్రజలను తూలనాడిన సంగతి మరచిపోయి, ఇప్పుడు దివీస్ నిర్మిత ప్రాంతం మీద ప్రేమ ఒలకబోస్తున్నట్టు నటించడం నయవంచన అవుతుందని అభిప్రాయపడుతున్నారు. యనమల గురివిందలా వ్యవహరించవద్దని పలువురు సూచిస్తున్నారు.