iDreamPost
iDreamPost
సీఎం పదవి పోయి.. కుమారుడికి పదవి దక్కక.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కొత్త చిక్కుల్లో చిక్కుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వేల కోట్ల విలువైన నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్ల కుంభకోణం ఆయన మెడకు చుట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. యడ్డీ కుటుంబానికి సన్నిహితుడైన సీఎంవో కార్యాలయ ఉద్యోగి ఉమేష్ తోపాటు పలువురు ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల ఇళ్లలో పెద ఎత్తున ఆదాయ పన్ను అధికారులు దాడులు జరిపారు. ఉమేష్ నివాసాలు, కార్యాలయం నుంచి వందల కోట్ల నగదు, కీలకమైన పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడంతో ఇరిగేషన్ టెండర్ల కేటాయింపులోని చీకటి కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ యడ్యూరప్ప హయాంలో ఆయన కార్యాలయం నుంచి జరగడంతో.. అది చివరికి ఆయనకు చుట్టుకుంటుందని అంటున్నారు.
రూ.25 వేల కోట్ల టెండర్లు
కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణభాగ్య జలమండలి ప్రాజెక్టు టెండర్ల ఖరారులో అనేక అక్రమాలు జరిగాయని కొంతకాలం నుంచీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తొమ్మిదేళ్లుగా యడ్డీ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న మాజీ బస్సు డ్రైవర్ ఉమేష్.. యడ్డీ సీఎం అయిన తర్వాత ఆయనకు పిఏగా మారి సీఎం కార్యాలయంలో తిష్ట వేశాడు. రూ.25 వేల కోట్ల విలువైన కృష్ణభాగ్య జలమండలి టెండర్ల ఖరారులో ఆయనే కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల కేటాయింపు, ప్రతిగా నగదు బదిలీ వంటి లావాదేవీలు యడ్డీ కనుసన్నల్లో ఉమేష్ చేశాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆందుకు తగినట్లే ఆదాయ పన్ను అధికారులు ఆ లావాదేవీలపైనే దృష్టి సారించి.. యడ్డీ సన్నిహిత కాంట్రాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లను ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగం ఊడింది
2012 నుంచి యడ్యూరప్ప నీడలో ఉన్న ఉమేష్ మాజీ సీఎం కుమారులు రాఘవేంద్ర, విజయేంద్రలతో పాటు మొత్తం ఆ కుటుంబానికే సన్నిహితుడు. యడ్యూరప్ప వెంట నిరంతరం ఉండే ఆయన రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లోనూ మంచి గుర్తింపు పొందాడు. పనులు చక్కబెట్టడంలో దిట్ట అని నిరూపించుకున్నాడు. యడ్డీ సీఎంగా ఉన్నన్నాళ్లు రాజభోగం అనుభవించిన ఉమేష్ దర్జా యడ్డీ పదవితో పాటే పోయింది. కాగా ఆదాయ పన్ను శాఖ దాడులు..పెద్ద ఎత్తున నగదు దొరికిన నేపథ్యంలో ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై సదరు ఉమేష్ ఉద్యోగాన్ని ఊడగొట్టారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సీఎం కార్యాలయంలో పని చేస్తున్న ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : యడ్యూరప్ప సన్నిహితులపై ఐటీ దాడుల వెనుక ఆంతర్యమేమిటీ..?