పెద్దగా చదువు అబ్బకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు నేరాల బాట పట్టాడు.ఎంతో తెలివిగా నేరాన్ని చేసానని తననెవరు పట్టుకోలేరు అనుకున్నాడు. కానీ చిన్నతనంలో తాను నిర్లక్ష్యం చేసిన చదువే తనని పోలీసులకు పట్టుస్తుందని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు చేసిన నేరానికి కటకటాల్లోకి వెళ్ళాడు. నిరక్షరాస్యత కారణంగా దొరికిపోయిన నేరస్తుడిగా వార్తల్లో నిలిచిపోయాడు.
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హర్దోయ్ ప్రాంతానికి చెందిన రామ్‌ప్రతాప్ సింగ్ సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్టోబర్ 26న ఒక బాలుడిని కిడ్నాప్ చేసాడు. అనంతరం బాలుడు కిడ్నాప్ విషయం బయట పెడతాడేమో అని అతడిని కిరాతకంగా హత్య చేసాడు. తర్వాత ఒక మొబైల్ ఫోన్ దొంగిలించి దాని ద్వారా బాలుడి తండ్రికి రెండు లక్షలు తనకు ఇస్తే బాలుడిని వదిలిపెడతాను అంటూ మెసేజ్ చేసాడు. ఇక్కడవరకు తెలివిగా వ్యవహరించిన దొంగ ఒక విషయంలో తప్పటడుగు వేయడంతో పోలీసులకు దొరికిపోయాడు.
తన కొడుకు కిడ్నాప్ అయ్యాడని బాలుడి తండ్రి నవంబర్ 4 న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముందుగా ఫోన్ నంబర్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. కాగా ఆ మొబైల్ దొంగిలించిన మొబైల్ గా తేలడంతో పోలీసులు బాలుడి తండ్రికి పంపిన మెసేజ్ ను పరిశీలించారుబాలుడి తండ్రికి పంపిన మెసేజ్ లో సీతాపూర్ అనే పదాన్ని తప్పుగా రాయడాన్ని గమనించిన పోలీసులకు బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తికి చదువు అంతగా రాదని నిర్దారణకు వచ్చారు. అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో భాగంగా పోలీసులు తెలివిగా వ్యవహరించారు. నాకు పోలీస్ ఉద్యోగం కావాలి. అందుకోసం హర్దోయ్ నుంచి సీతాపూర్ వరకు పరిగెత్తగలను. అనే వాక్యాన్ని రాయమని ఆ పదిమందికి చెప్పడంతో వాళ్లంతా తమకు వచ్చిన రీతిలో ఆ వాక్యాన్ని రాసారు. సదరు కిడ్నాపర్ అయిన రామ్‌ప్రతాప్ సింగ్ మాత్రం మరోసారి సీతాపూర్ అనే పదాన్ని తప్పుగా రాయడమే కాకుండా పోలీస్ అనే పదాన్ని కూడా పోలిష్ అని రాసాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి బాలుడిని కిడ్నాప్ చేసింది తానేనని బాలుడిని హత్య చేసినట్లు వెల్లడించడంతో రామ్‌ప్రతాప్ సింగ్‌ని అరెస్ట్ చేశారు. పదాలను సరిగా రాయలేక నిరక్షరాస్యత కారణంగా అరెస్ట్ అయిన వ్యక్తిగా రామ్‌ప్రతాప్ సింగ్ వార్తల్లో నిలిచిపోయాడు.