Idream media
Idream media
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న అంశం కరోనా వ్యాక్సిన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇది శుభపరిణామం అని చెప్పారు. అలాగే జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తూ జనవరిలో వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా త్వరలోనే వ్యాక్సిన్ రాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. అలాగే ఇటీవల పార్లమెంట్ లో కూడా వ్యాక్సిన్ పై తీవ్రంగా చర్చ జరిగింది. వీటన్నిటి సారాంశం వచ్చే ఏడాది ప్రారంభంలోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నాయి. దీంతో చాలా మంది అప్పటి వరకూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతోపాటు వ్యాక్సిన్ రాకకు సంబంధించిన వార్తలు కూడా ఎక్కవగా చక్కర్లు కొడుతున్నాయి.
ఊరటనిచ్చే అంశం..
కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ ఊరటనిచ్చే అంశాన్ని ఇటీవల వెల్లడించారు. దేశంలో నాలుగు కంటే ఎక్కువ వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకటించారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై పార్లమెంటులో ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనాపై పోరులో భాగంగా 30 టీకాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. వీటిలో ప్రీ-క్లినికల్ ప్రయోగాల్లో అధునాతన దశల్లో నాలుగు, ఫేజ్-1, 2, 3 దశల ప్రయోగాల అడ్వాన్స్ డ్ స్టేజ్ లో మూడు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ కు చెందిన ఆ కంపెనీ వ్యాక్సిన్ పై
ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై ఐదు వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ దశలో ఉండగా, 35 కు పైగా క్లినికల్ ట్రయల్స్ లో తలమునకలై ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిల్లా ప్రయోగ ఫలితాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ముందున్న వారిలో భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఒకటి. అలాగే పూణేకు చెందిన సీరం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే కూడా వెల్లడించారు. కోవిడ్19 వ్యాక్సిన్ తయారీ కోసం దేశంలో ఆరు సంస్థలకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఐ) అనుమతించినట్లు మంత్రి చెప్పారు. అనుమతి పొందిన తయారీదారులలో పూనేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్, జెనోవా బయోఫార్మాస్యూటికల్స్, అహ్మదాబాద్‌కు చెందిన కాడిలా హెల్త్‌కేర్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, అరవిందో ఫార్మా, ముంబైకి చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఉన్నట్లు ఇటీవల వివరించారు.