Idream media
Idream media
పుస్తకంతో స్నేహం ఇప్పటిది కాదు. అదో పిచ్చి, వ్యసనం కూడా. వూహ వచ్చేసరికి నేను చూసిన మొదటి పుస్తకం ఒకటో తరగతి వాచకం. స్కూల్లో చేరక ముందే అది ఇంట్లో వుండేది. రంగుల బొమ్మలతో ముద్దుగా వుండేది. అన్నిటి కంటే ఇష్టమైన బొమ్మలు వుడుత, వూయల. ఐదు పైసలు. తరువాతి పుస్తకం చందమామ. చదవడం రాకపోయినా బొమ్మలు చూస్తుంటే ఆనందం. విక్రమార్కుడి కథలో భుజాన భేతాళుడి కంటే నేలమీది పుర్రెలు ఎక్కువగా భయపెట్టేవి.
రెండో తరగతిలో రైలు ప్రయాణం పాఠాన్ని చాలాసార్లు చదువుకునేవాన్ని. సామర్లకోట స్టేషన్‌లో రైలు ఆగుతుంది. దాన్ని పరిచయం చేయడం పాఠం. చందమామ కాకుండా ఇంటికి అప్పుడప్పుడు విజయచిత్ర, సినిమా రంగం వచ్చేవి. బొమ్మలు చూడడం కాకుండా చదవడానికి ప్రయత్నించేవాన్ని.
మా తాతకి లైబ్రరి మెంబర్‌షిప్ వుండేది. ఆయన కోసం పుస్తకాలు తెచ్చేవాన్ని. అర్థం కాని పురాణాల్ని కూడా తిరగేసేవాన్ని. చాలా చిన్న వయసులోనే విషయంతో సంబంధం లేకుండా చింతామణి నాటకం చదివేశాను. ఆరో తరగతికి వచ్చే సరికి శ్రీధర్ అనే స్నేహితుడి ఇంట్లో ఆంధ్రప్రభ వీక్లీ తెప్పించే వాళ్లు. వాడి కోసం వెళితే స్నానానికని అరగంట, భోజనానికి గంట వెళ్లేవాడు. ఈ టైంలో వీక్లీ చదివేసేవాన్ని. సినిమా వార్తలు , పిల్లల కథ ఫస్ట్ ప్రయారిటి.
7వ తరగతికి కథలు, నవలలు అలవాటయ్యాయి. చదివిన మొదటి కథల పుస్తకం సొదుం జయరాం సింహాద్రి స్వీట్‌హోం. ఆ కథలన్నీ ఇప్పటికీ గుర్తు. నేనూ, శ్రీధర్ సాయంత్రం పూట పుస్తకాల్ని నమిలేసే వాళ్లం. బాలకృష్ణుడి లీలలు, పది భాగాలు బొమ్మలతో వుండేది. చాలా సార్లు చదివినట్టు గుర్తు. 8వ తరగతిలో వున్నట్టుండి నాటకాల పిచ్చి పట్టుకుంది. చిన్నచిన్న నాటకాల పుస్తకాల్ని చదవడం ప్రారంభించాం.
రాయదుర్గం లైబ్రరీలో బయట మేగజైన్స్, న్యూస్ పేపర్ సెక్షన్, లోపల ఒక గదిలో కథలు, నవలల సెక్షన్ వుండేది. లైబ్రేరియన్ ఎపుడూ జోగుతూ వుండేవాడు. లేదంటే బయట సిగరెట్ తాగుతూ కనిపించేవాడు. అక్కడ కూచుని నల్లులతో కుట్టించుకుంటూ చదవడం కంటే, కొట్టేయడం సులభమని తీర్మానించుకున్నాం. రోజూ ఒకటి రెండు నాటకాలను చొక్కా కింద నిక్కర్‌లో దోపుకు వచ్చాం. సుమారు 30 పుస్తకాలు లేపేశాం. అది తప్పని తెలుసు. కానీ పుస్తకాల మీద ప్రేమ. రామాయణంలో యుద్ధకాండ బాగా ఇష్టం. యుద్ధ సన్నివేశాల్ని పదేపదే నేనూ శ్రీధర్ చదివే వాళ్లం. కానీ అది లావుపాటి పుస్తకం. కొట్టేయడం కష్టం. దొరికిపోతాం.
ఆ టైమ్‌కి గౌస్ అనే కొత్త స్నేహితుడు కలిసాడు. విషయం చెబితే ఇంతే కదా అని యుద్ధాన్ని పొట్టలో దాచుకుని వచ్చాడు. వాడి ధైర్యం, సాహసానికి షాక్ అయ్యాం. ఇపుడు కల్తీ నిరోధక శాఖలో వీడు పెద్ద అధికారి, ప్రజల్ని ఆ దేవుడే కాపాడాలి!
తర్వాత డిటెక్టివ్‌లు పరిచయమయ్యారు. యుగంధర్, నర్సన్ మా ఇంట్లో మనుషులయ్యారు. నేను కూడా డిటెక్టివ్ అవుదామ నుకున్నా కానీ, మెడిసిన్ చదివితే డాక్టర్, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అవుతారు కానీ, డిటెక్టివ్ కావాలంటే ఏం చేయాలో తెలీక ఆగిపోయి డిటెక్టివ్ బుక్స్ మాత్రమే చదివాను.
టెన్త్ దాటే సరికి యద్ధనపూడి , మాదిరెడ్డి, కోడూరి కౌసల్యాదేవి నవలలు అయిపోయాయి. ఇంటర్‌లో యండమూరి, మధుబాబు. షాడో పుస్తకాలు దాదాపు పాతిక ఒక వారంలో చదివేశా. ఇంటర్ ముగిసే సరికి ఒక రెంటెడ్ బుక్‌స్టాల్ వాడి అప్పు తీర్చలేక చేతికున్న వాచీ ఇచ్చేశాను.
ఇదంతా ఒకెత్తయితే 1980లో తరిమెల నాగిరెడ్డి లైబ్రరి పరిచయమైంది. అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో రెండు చిన్న గదుల్లో ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. ఆ పుస్తకాలన్నీ ఆయన కలెక్షనే. అక్కడ కొత్త ప్రపంచాన్ని చూశాను. అప్పటి వరకూ వున్న అభిప్రాయాల్ని మార్చేసింది.
జర్నలిస్ట్‌గా తిరుపతిలో జీవనం. వారంలో ఒక్కసారైనా విశాలాంధ్రలో గడపకపోతే తోచేది కాదు. ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీకి కొన్నాళ్ల పాటు రెగ్యులర్‌గా వెళ్లాను. ఏం చదివామన్నది కాదు, పుస్తకాల మధ్య వుంటే అదో ఆనందం.
హైదరాబాద్‌లో ఆదివారాలు అబిడ్స్‌లో సంచరిస్తూ పాత పుస్తకాలు వెదకడం ఓ అనుభూతి. ఈ మధ్య అమెరికాలో బార్న్స్ అండ్ నోబుల్ (Barns and Noble) బుక్ స్టోర్ చూసి సంతోషం, అద్భుతం రెండూ. అంత పెద్ద స్టోర్ ఎపుడూ చూడలేదు.
ఇల్లు మారినప్పుడల్లా సగం పుస్తకాలు, సగం మిగతా సామాను, నన్నూ, నా పుస్తకాల్ని మా ఆవిడ సహనంతో భరించింది. ఏదైనా పుస్తకం అవసరం పడితే , దాన్ని వెతకడం కంటే కొత్తది కొనడమే మేలు అనుకున్న సందర్భాలున్నాయి. ఆ పుస్తకాల్ని చూసి ఈ డబ్బులకి మనకో ఇల్లు వచ్చిండేది అంటుంది మా ఆవిడ.
పుస్తకాలు లేని సొంత ఇంటి కంటే, పుస్తకాలున్న అద్దె ఇల్లే నాకు సుఖం. ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం.
(ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం)