న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే భయం. పరువు మర్యాదలకు భంగం కలుగుతుందని ఆందోళన. చుట్టు పక్కల వాళ్ళు హేళనగా చూస్తారని సిగ్గు. తోడుగా ఎవరైనా వస్తే బాగుండని ఆలోచన. సహాయం అడగాలంటే బిడియం. ఇవన్నీ దాటుకుని స్టేషన్ కు వెళితే పోలీసుల తీరు తో అవమానం. న్యాయం కోసం వెళితే అవమానం జరగడం. తమనే అనుమానించడం. రోజుల తరబడి స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు.. ఇవి సర్వ సాధారణంగా అన్యాయానికి గురైన మహిళలు ఎదుర్కునే సమస్యలు. పట్టణాలలోని మహిళలకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటే.. ఇక పల్లె మహిళల పరిస్థితి చెప్పనక్కర్లేదు. పట్టణాలలోనే మహిళల పై వెలుగు చూడని కేసులు కోకొల్లలుగా ఉంటాయి. పల్లెల్లో కేసుల ఊసే ఎత్తడం బహు అరుదు.
ఈ సమస్యకు జగన్ సర్కార్ చమర గీతం పాడింది. అబలలకు అండగా నిలిచింది. మహళలపై ఎలాంటి అన్యాయం జరిగినా ఇకపై ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కడో దూరంగా, పట్టణంలో ఉన్న స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం ఇకపై లేదు. మహిళలు తమ సమస్యలపై తమ ఇంటికి దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాలలో ఫిర్యాదు చేయొచ్చు. అక్కడ ఉన్న మహిళా రక్షణ కార్యదర్శికి ఫిర్యాదు చేసేలా నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలనను సీఎం జగన్ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ తో దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. వార్డుల్లో ఆరు మంది, గ్రామ సచివాలయంలో గరిష్టంగా 13 మంది పోస్టులను సృష్టించారు. అందులో మహిళా రక్షణ కార్యదర్శి పోస్టు ఒకటి. మహిళా రక్షణ కార్యదర్శి మహిళా కానిస్టేబుల్ గా పని చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,967 గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించారు. మహిళల భద్రత, రక్షణ, రూల్ ఆఫ్ లా, పోలీసు సమస్యలు, శాంతిభద్రతలు, మహిళా శిశు సంక్షేమ సేవలపై వీరికి శిక్షణ ప్రారంభమైంది. రెండు వారాల శిక్షణ అనంతరం వీరు విధుల్లో చేరనున్నారు. నూతన సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ లో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది.