iDreamPost
iDreamPost
దేశ రాజధాని ఢిల్లీలో అదో ప్రముఖ హోటల్. అందులో ప్రవేశానికి సదరు హోటల్ నిర్వాహకులు ఓ డ్రెస్ కోడ్ పెట్టారు. ఆ డ్రెస్ కోడ్ లో పేర్కొన్న సంప్రదాయ దుస్తులు ధరించిన వారికే హోటల్లోకి అనుమతి అని స్పష్టంగా పేర్కొన్నారు. సంప్రదాయ దుస్తులంటే మన దేశంలో సాధారణంగా పురుషులకు ప్యాంట్, షర్ట్.. మహిళలకైతే చీర అనే అర్థం. కానీ సంప్రదాయ దుస్తులు అనే దానికి ఆ హోటల్ యాజమాన్యం సొంత భాష్యం చెప్పడం.. ఇప్పుడు దాని పరువునే బజారుకీడ్చింది. రేటింగులు దారుణంగా పడిపోయేలా చేసింది.
చీర మా డ్రెస్ కోడ్ జాబితాలో లేదు
ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లలో ఒకటైన అక్విలా హోటల్ కు అనితా చౌదరి అనే మహిళ వెళ్లింది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరకట్టుతో ఉన్న ఆమెను ప్రవేశ ద్వారం వద్దే సిబ్బంది నిలిపివేశారు. కారణం ఏమిటని ఆ మహిళ అడిగితే చీర తమ హోటల్ నిర్దేశించిన స్మార్ట్ క్యాజువల్స్ జాబితాలో లేదని, అందువల్ల లోనికి వెళ్లడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో అవాక్కయిన అనితా చౌదరి హోటల్ సిబ్బందితో జరిగిన సంభాషణల వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. సంప్రదాయ వస్త్రధారణ అంటే ఏమిటో.. ఎటువంటి దుస్తులు ధరించాలో హోటల్ నిర్వాహకులు చెబితే చీర ధరించడం మానేస్తానని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
పడిపోయిన రేటింగ్
అనితా చౌదరి ట్విట్టర్లో పెట్టిన పోస్టు.. చేసిన కామెంట్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ట్వీట్ ను ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ కు తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు హోటల్ యాజమాన్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎటువంటి డ్రెస్ కోడ్ అమలు చేయాలనేది హోటల్ వారి ఇష్టమే అయినప్పటికీ భారతీయ సంప్రదాయ వస్త్రధారణను తిరస్కరించడం దారుణమని మండిపడుతున్నారు. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేయడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. అక్విలా హోటల్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని సుబెందు అనే నెటిజన్ వ్యాఖ్యానించారు. చీరను అవమానించిన పాపానికి ఆ హోటల్ విశ్వసనీయత పడిపోయింది. కొన్ని గంటల వ్యవధిలోనే దాని రేటింగ్ పడిపోయింది. గూగుల్లో 1.5 శాతం, జోమాటోలో రెండు శాతానికి తగ్గిపోయింది. హోటల్ పై నెగెటివ్ సమీక్షలు కూడా వస్తుండటంతో హోటల్ మనుగడకు ప్రమాదంగా మారింది.
Also Read : యూనివర్సీటీ ఉంటే ఎన్నో ఫలితాలు – ఇవిగో ఉదహారణలు