iDreamPost
android-app
ios-app

వైరస్ కోరల్లో బచ్చన్ ఫ్యామిలీ

  • Published Jul 12, 2020 | 10:32 AM Updated Updated Jul 12, 2020 | 10:32 AM
వైరస్ కోరల్లో బచ్చన్ ఫ్యామిలీ

నిన్న రాత్రి బిగ్ బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లు కరోనా బారిన పడ్డారన్న వార్త వెలువడి 24 గంటలు గడవకముందే మరో షాక్ అభిమానులను కుదిపేస్తోంది. తాజాగా కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య బచ్చన్ కు సైతం వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. ముంబై నానావతి ఆసుపత్రిలోనే వీళ్ళకు చికిత్స అందుతోంది. జయ బచ్చన్ కు నెగటివ్ రావడం కొంత రిలీఫ్. నిజానికి ఐష్ కు సైతం టెస్టుల్లో కరోనా లేదని నిన్న ఓ వార్త వచ్చింది. అయితే రెండో సారి సాంపిల్స్ తీసుకున్నాక ఇప్పుడు అసలు విషయం బయటపడింది. బిగ్ బి తాను సంపూర్ణ రక్షణలో ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసిన నేపధ్యంలో అభిమానులు కొంత రిలాక్స్ గా ఫీలవుతున్నారు.

అంత వయసున్న అమితాబే ఇంత సులువుగా కోలుకుంటునప్పుడు మిగిలినవాళ్ళకు అదేమంత సమస్య కాదు. రికవరీ శాతం అధికంగా ఉన్న పరిస్థితిలో బచ్చన్ కుటుంబం క్షేమంగానే బయట పడుతుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. చిరంజీవితో మొదలుకుని వర్మ దాకా అందరూ ట్వీట్లు పెట్టారు. ఇప్పుడీ వార్తలు బాలీవుడ్ వర్గాలను కలవరపెడుతున్నాయి. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే వ్యవహారాలు చూసుకుంటున్న వాళ్ళకు ఇది పెద్ద షాక్ కలిగించింది. ఎందుకంటే అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతికి సంబంధించిన ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ ని స్వగృహం నుంచే చేస్తున్నారు.

ఆ క్రమంలో యూనిట్ సభ్యులు ఇంటికి రావడం వల్ల ఎవరి నుంచో ఇది సోకింది. వాళ్ళను ట్రేస్ లో పనిలో పడ్డాయి అధికారిక వర్గాలు. అయితే బయటికి వెళ్ళకుండా ఇంటి నుంచే అన్ని చక్కదిద్దాలనుకునే వారికి ఇది వార్నింగ్ బెల్ గా మారింది. వైరస్ కి చిన్నా పెద్దా ధనిక పేదా అనే తేడాలు ఉండవని మరోసారి రుజువయ్యింది . దెబ్బకు ఇతర స్టార్లందరూ తమ ఇళ్ళ దగ్గర నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారట. వ్యక్తిగత స్టాఫ్ ని సైతం తమ దగ్గరే ఉంచుకుని అన్ని వసతులు కల్పిస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి బచ్చన్ ఫ్యామిలీలో నలుగురు వైరస్ బారిన పడటం చూస్తుంటే సామాన్యులు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పినట్టయింది. సో గడప దాటకపోవడం ఎంత ముఖ్యమో బయటి వాళ్ళు రాకుండా చూసుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం.