iDreamPost
android-app
ios-app

దాడిశెట్టి రాజా ఆశలు పండేనా, అధినేత అవకాశమిచ్చేనా

  • Published Sep 08, 2021 | 7:12 AM Updated Updated Sep 08, 2021 | 7:12 AM
దాడిశెట్టి రాజా ఆశలు పండేనా, అధినేత అవకాశమిచ్చేనా

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత చక్రం తిప్పే కీలక నేత యనమల రామకృష్ణుడు. ఆయన సొంత నియోజకవర్గం తునిలో వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. 1983 నుంచి 2004 వరకూ ఆరు ఎన్నికల్లో యనమలకి తిరుగులేని విజయాలు దక్కాయి. ఆయనకు పోటీగా ఎవరిని బరిలో దింపినా ఓటమితో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. దాంతో ప్రత్యర్థి పార్టీలకు ఇది మింగుడుపడని స్థితిగా ఉండేది ఆ రోజుల్లో. ఈ నేపథ్యంలో యనమల హవాకి అడ్డుకట్ట వేసేందుకు 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన వ్యూహం ఫలించింది. ఏడో ఎన్నికల్లో బరిలో దిగిన యనమల రామకృష్ణుడు ఓటమి పాలయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన రాజా అశోక్ బాబు విజయం సాధించడం సంచలనమయ్యింది. నిజానికి అప్పటికే రెండుసార్లు అశోక్ బాబు అదే యనమల చేతిలో ఓడిపోయారు.

అంతకుముందే వైఎస్సార్ సీఎంగా ఉండగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తుని పురపాలక సంస్థలో ఒక్క కౌన్సిలర్ ని కూడా గెలిపించుకోలేకపోవడంతో యనమల ఓటమికి బీజాలు పడ్డాయి. నాటి నుంచి తునిలో వైఎస్సార్ రచించిన పథకం ప్రకారం పట్టు సాధించేందుకు మార్గం సుగమమయ్యింది. ఇక ఆ ఎన్నికలతో యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కావాల్సి వచ్చింది. పరోక్ష ఎన్నికలకే పరిమితం కావడం ద్వారా ఆయన తునికి దూరమయ్యారు. తన స్థానంలో తమ్ముడు యనమల కృష్ణుడిని రంగంలో దింపినా 2014 ఎన్నికల్లో ఆయనకు పోటీగా వైఎస్ జగన్ ఎంపిక చేసిన యువనేత దాడిశెట్టి రాజా తెరమీదకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ హవాకి అడ్డుకట్ట వేసి ఆ ఎన్నికల్లో దాడిశెట్టి రాజా గెలవగలిగారు. ఆ తర్వాత 2019లో కూడా సునాయాసంగా తుని లో పట్టు నిలుపుకోగలిగారు.

Also Read : పండ‌గ రాజ‌కీయం : బీజేపీ తానా అంటే.. బాబు తందానా!

వాస్తవానికి దాడిశెట్టి రాజా కి రాజకీయంగా అవకాశం రావడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. తుని పరిసరాల్లో దాడిశెట్టి నరసయ్య అంటే తెలియనివారుండరు. బంగారం వ్యాపారంలో నరసయ్యకి మంచి గుర్తింపు ఉంది. అలాంటి నరసయ్య మనవడిగా దాడిశెట్టి రాజా వాడవాడలా ప్రచారం పొందారు. నరసయ్య కుటుంబీకుడిగా మంచి ఆదరణ దక్కించుకున్నారు. యనమల కోటను రాజా అశోక్ బాబు బద్దలు కొడితే దాడిశెట్టి రాజా దానిని భూస్థాపితం చేసేందుకు దోహదపడిన అంశాల్లో దాడిశెట్టి నరసయ్య ఇమేజ్ కూడా ఉంది. విపక్షంలో ఉన్న సమయంలో అనేక ఆటంకాలను ఎదుర్కొన్న రాజా రాజకీయంగా బలపడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ టీడీపీ నేతల పెత్తనంతో ఆయనకు అవకాశం లేకుండా పోయింది. పైగా వివిధ కేసులతో క్యాడర్ ని వేధిస్తున్న సమయంలో వారందరికీ అండగా నిలవాల్సిన బాధ్యత రాజా మీద పడింది. అయినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవడంలో చూపించిన చొరవ దాడిశెట్టి రాజా బలాన్ని పెంచడానికి తోడ్పడింది.

2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచిన తర్వాత జగన్ దగ్గర ఉన్న పలుకుబడితో తనకు మంత్రి పదవి దక్కుతుందని రాజా ఆశించారు. కాపు సామాజికవర్గం, యనమలని ఎదుర్కొన్న నేపథ్యం ఉపయోగపడతాయని భావించారు. కానీ జగన్ మాత్రం కురసాల కన్నబాబు వైపు మొగ్గుచూపారు. రాజకీయ అవగాహన, విద్యావంతుడు కావడంతో కన్నబాబుకి అవకాశం వచ్చింది. ఇక ఇప్పుడు రెండున్నరేళ్ల పాలసీలో మంత్రివర్గంలో మార్పులు జరిగితే ఈసారి తనకే బెర్త్ దక్కుతుందని దాడిశెట్టి రాజా బలంగా విశ్వసిస్తున్నారు ఇప్పటికే ఆయన అనుచరులంతా కాబోయే మంత్రిగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ జగన్ ఏం ఆలోచిస్తారన్నది ఆసక్తికరమే. తూ గో జిల్లా నుంచి కాపు సామాజికవర్గంలో క్యాబినెట్ బెర్త్ కి గట్టి పోటీ ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయిన తోట త్రిమూర్తులు, తొలిసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జక్కంపూడి రాజా కూడా రేసులో ఉన్నారు. కానీ ఎవరికి ఉన్న బలాలు , బలహీనతలు వారికున్న నేపథ్యంలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. దాడిశెట్టి రాజా కలలు పండుతాయో లేదో అన్నది వచ్చే నెలలో తేలుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read : బడేటి బుజ్జి కి ప్రత్యామ్నాయం ఎవరు?