iDreamPost
iDreamPost
ప్రస్తుతం క్రాక్ షూటింగ్ బ్యాలెన్స్ ని పూర్తి చేసేందుకు ఎదురు చూస్తున్న మాస్ మహారాజా రవితేజ దాని తర్వాత వరసగా కమిట్మెంట్స్ అయితే ఇచ్చాడు కానీ ఏ దర్శకుడిది ముందు ప్రారంభమవుతుందో అంతు చిక్కడం లేదు. రమేష్ వర్మ-త్రినాధరావు నక్కిన-వక్కంతం వంశీ ఇలా లైనప్ పెద్దదే ఉంది. ఇంకో ఇద్దరు చర్చల దశలో ఉన్నారు. పెద్ద హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్ళేదాకా ఇండస్ట్రీ పూర్తి ధైర్యంతో ముందడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు. అది దసరా తర్వాతనా లేక అంతకన్నా ముందా అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉండగా రమేష్ వర్మతో చేయాల్సిన సినిమాకు తమిళ చిత్రం సతురంగ వెటై 2 కథను ఎంచుకున్నట్టు గతంలోనే టాక్ వచ్చింది.
అరవింద స్వామి, త్రిష జంటగా నటించిన ఆ మూవీ ఇంకా విడుదల కాలేదు. ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఆఖరికి డిజిటల్ రిలీజ్ కూడా రెడీ అయ్యిందని చెన్నై టాక్. ఫాన్సీ రేట్ కి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని వినికిడి. ఒకవేళ ఇదే నిజమైతే ఈ రీమేక్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే కరోనా పుణ్యమాని జనం బాషలతో సంబంధం లేకుండా కొత్త సినిమాలను సబ్ టైటిల్స్ సహకారంతో విపరీతంగా చూసేస్తున్నారు. ఏప్రిల్ మేలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సైతం తమ స్ట్రీమింగ్ స్పీడ్ ని పరిమితం చేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతగా ఓటిటి ప్రేక్షకుల స్మార్ట్ డివైజెస్ లోకి చొచ్చుకుపోయాయి.
అలాంటప్పుడు సతురంగ వెటై 2ని ఎంచుకోవడం ఎంతో కొంత రిస్క్ కాక మానదు. ఈ సినిమా మొదటి భాగమే సత్య దేవ్ హీరోగా తెలుగులో బ్లఫ్ మాస్టర్ పేరుతో వచ్చింది. అక్కడ బ్లాక్ బస్టరే కానీ ఇక్కడ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దాన్ని మించి సెకండ్ పార్ట్ తీశారని టాక్ ఉంది కానీ ఎందుకనో ఏడాదికి పైగా ధియేటర్లకు రాకుండా ఆగిపోయింది. అసలు ఇంతకీ రమేష్ వర్మ ఎంచుకున్న కథ ఇదో కాదో కూడా ఖచ్చితంగా తెలియదు కానీ టాక్ అయితే బలంగా ఉంది. మరో న్యూస్ ప్రకారం అరవింద్ స్వామి, జయం రవి నటించిన బోగన్ రీమేక్ కూడా రవితేజ లిస్టులో ఉందని చెబుతున్నారు. ఈ సస్పెన్స్ తోలగాలంటే ఇంకోద్దిరోజులు ఆగాల్సిందే