iDreamPost
iDreamPost
నిన్నా మొన్న దసరా పండగ సందర్భంగా టాలీవుడ్ క్రేజీ సినిమాలు 2021 సంక్రాంతి విడుదల అంటూ ప్రకటనలు ఇచ్చి హడావిడి చేసుకున్నాయి. రామ్ రెడ్, రవితేజ క్రాక్, రానా అరణ్య, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లు కొత్త పోస్టర్లతో క్లారిటీ ఇచ్చేయగా నాని రంగ్ దే ఎప్పుడో టీజర్ టైంలోనే స్పష్టం చేసింది. అంటే మొత్తం 5 సినిమాలు ఇప్పటిదాకా ఆ సీజన్ ని టార్గెట్ చేసుకుని ఉన్నాయి. అయితే తెలివిగా డేట్లను మాత్రం అనౌన్స్ చేయలేదు. దానికి కారణం లేకపోలేదు. ముందు ఎవరైనా చేస్తే దాన్ని బట్టి తమ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. సో ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం లేనట్టే. నిజంగా ఇవన్నీ సంక్రాంతికి ఖచ్చితంగా వస్తాయా రావా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇక్కడ కొన్ని అంశాలను పరిశీలించాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని చోట్ల మినహాయించి దేశవ్యాప్తంగా థియేటర్లను తెరిచారు. అందులోనూ అధికంగా మల్టీ ప్లెక్సులే ఉన్నాయి. కానీ స్పందన మాత్రం మరీ తీసికట్టుగా ఉంది. కనీస వసూళ్లు కూడా రావడం లేదు. మొదటి రెండు మూడు రోజులు ఏదో కొత్త మోజుతో పాత సినిమాలకే ప్రేక్షకులు వచ్చారు కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని ఓటిటిలో చూసే వీలున్న సినిమాలను అదే పనిగా ఖర్చు పెట్టుకుని రిస్క్ ఎందుకు చేయాలని చాలా మంది ఆగిపోయారు. అందుకే కలెక్షన్లు లేక సదరు స్క్రీన్లు అలో లక్ష్మణా అంటూ కేకలు పెడుతున్నాయి. నవంబర్ కూడా ఇలాగే ఉండబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
సరే చెప్పడమైతే చెప్పారు కానీ నిజంగా పైన చెప్పిన అయిదు సినిమాలు మాటకు కట్టుబడతాయా అంటే ఏమో మరి. ఒకవేళ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా రేస్ లో దిగితే ఖచ్చితంగా ఒకరో ఇద్దరో డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే థియేటర్ల సంఖ్య అందుకు అనుగుణంగా లేదు. నిర్మాత దిల్ రాజు అయితే గట్టిగానే ట్రై చేస్తున్నారట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. జనవరికంతా ప్రభుత్వాలు థియేటర్లలో ఫుల్ కెపాసిటీని పర్మిషన్లు ఇస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇంకా రెండు నెలలకు పైగా టైం ఉంది కాబట్టి ఆలోగా వ్యాక్సిన్ కూడా రావొచ్చని ఆశాభావం ఇండస్ట్రీలో ఉంది. అది వచ్చినా కూడా జనాభా మొత్తానికి సరిపోయేంత సప్లై ఉండదు. కాబట్టి సంక్రాంతికి రాబోయే సినిమాలు మాట మీద ఉంటాయా లేదా అనేది చాలా సమీకరణాల మీద ఆధారపడి ఉంది. చూద్దాం.